జమ్మలమడుగు : మైలవరం మండలం దొడియం గ్రామానికి చెందిన తల్లీకూతుర్లు లక్ష్మీదేవి(52), అఖిల(18) విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే స్థానికులు గుర్తించి వీరిని జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరువురి పరిస్థితి విషయంగా ఉండటంతో ప్రొద్దుటూరుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి కడప రిమ్స్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు స్థానికులు చెప్పిన మేరకు ఇలా ఉన్నాయి. లక్ష్మీదేవికి భర్త చనిపోయాడు. ఈమెకు ఇద్దరు మగ పిల్లలు, ఒక కుమార్తె. ఒక కుమారుడికి వివాహం జరిగింది. మరో కుమారుడు చదువుకుంటున్నాడు. తల్లీకూతుర్లు ఇద్దరూ ఇంటి వద్ద దోశల అంగడి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే వివాహామైన కుమారుడు తరచుగా తాగి వచ్చి డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తుండటంతో వారు విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుపుతున్నారు. మైలవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
కడప అర్బన్ : ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 267 కేసులు నమోదు చేసి, రూ. 57,900 జరిమానా విధించామనిని జిల్లా ఎస్పీ తెలిపారు. కార్లలో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ ప్రమాదకరమని, రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తప్పిన పెను ప్రమాదం
ఎర్రగుంట్ల : యర్రగుంట్ల పట్టణ పరిధిలోని శ్రీ చౌడేశ్వరీ దేవి ఆలయం సమీపంలో ముద్దనూరు రోడ్డులో నాపరాళ్ల ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. నాపరాళ్లను తీసుకెళ్తున్న ట్రాక్టర్ చౌడేశ్వరీదేవి ఆలయ సమీపంలోని శ్రీఆర్య భవన్ హోటళ్ల వద్ద ఉన్న బ్రేక్ కట్టలు దాటుతుండుగా అదుపు తప్పి బోల్తా పడింది. అయితే ఈ సంఘటనలో ప్రాణనష్టం జరుగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుకు ఆనుకుని హోటళ్లు ఉండటంతో వాహనదారులు రోడ్డుకు అడ్డంగా పార్కింగ్ చేస్తున్నారు. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.


