ప్రొద్దుటూరు క్రైం : రహదారిలో వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారిన కంకరను తొలగించమని చెప్పిన వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసి గాయపరిచిన ఘటన ప్రొద్దుటూరులో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని సూపర్‌బజార్ రోడ్డులోని శ్రీకాళహస్తి వీధికి చెందిన దుద్యాల హరి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతను శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో బైక్‌లో ఇంటికి బయలుదేరాడు. ఆయన ఇంటి వద్దనే ఎలక్ట్రికల్ పని చేసే సత్యం అనే వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం రోడ్డుపై కంకర తోలాడు. రోడ్డుకు అడ్డంగా కంకర ఉండటంతో ఆ దారిలో వెళ్లే వాహనదారులు కిందపడి ప్రమాదాల బారిన పడేవారు. ఈ క్రమంలో హరి కూడా బైక్‌లో అదే దారిలో వెళ్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. దీంతో అతను అక్కడే ఉన్న సత్యం వద్దకు వెళ్లి దీన్ని ప్రశ్నించాడు. రోడ్డుకు అడ్డంగా కంకర వేస్తే వాహనదారులకు ఇబ్బంది కదా.. కావున తొలగించాలని హరి సూచించాడు. ఆగ్రహించిన సత్యం నాకు చెప్పడానికి నువ్వు ఎవరు అంటూ హరిని పరుష పదజాలంతో ధూషించాడు. రోడ్డుపై వెళ్తున్న వాళ్లెవరూ నన్ను ప్రశ్నించలేదు, నువ్వు ప్రశ్నిస్తావా నిన్ను చంపితే ఎవరు కాపాడతారు అంటూ గొడ్డలి తీసుకొని హరి తలపై కొట్టడంతో తీవ్ర రక్తగాయాలయ్యాయి. సత్యం భార్య విజయ కూడా గొడ్డలి తిరగేసి హరిని కొట్టింది. హరికి తలతో పాటు శరీరంపై గాయాల య్యాయి. హరి తల్లి సావిత్రమ్మపై కూడా ఇరువురు దాడి చేయగా ఎడమ చేతికి గాయమైంది. అక్కడే ఉన్న స్థానికులు అడ్డు పడి హరిని, సావిత్రమ్మను కాపాడటంతో ప్రమాదం తప్పింది. గాయపడిన ఇరువురిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తనను చంపడానికి ప్రయత్నించిన సత్యం, అతని భార్య విజయపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు.
తీవ్రంగా గాయపడిన
డ్రైవర్ దుద్యాల హరి


