ప్రొద్దుటూరు క్రైం : మూడు రోజుల క్రితం ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్యా యత్నం చేసిన మల్లెపూల భువనేశ్వరి (30) చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందింది. గురువారం సాయంత్రం ప్రొద్దుటూరులోని ఈశ్వరరెడ్డినగర్‌కు చెందిన భువనేశ్వరి తన ముగ్గురు పిల్లలు సుష్మ, నిఖిత, ఘణలకు గడ్డి మందు కలిపిన కూల్ డ్రింక్ తాపించి ఆమె కూడా అదే కూల్‌డ్రింక్ తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. నలుగురిని కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించగా.. వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అదే రోజు రాత్రి కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. భువనేశ్వరి, పెద్ద కుమార్తె సుష్మల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు తల్లీకూతుళ్లిద్దరూ అపస్మారక స్థితిలోనే ఉండిపోయారు. అయితే సాయంత్రానికి ఇద్దరూ స్పృహలోకి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఉన్నట్టుండి భువనేశ్వరి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోవడంతో శనివారం సాయంత్రం మృతి చెందింది. ముగ్గురు పిల్లలు కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
కోలుకుంటున్న ముగ్గురు పిల్లలు


