రాయంచపై రాములోరి విహారం | - | Sakshi
Sakshi News home page

రాయంచపై రాములోరి విహారం

Mar 29 2026 7:05 AM | Updated on Mar 29 2026 7:05 AM

స్వామివారి కల్యాణ ఏర్పాట్లు పరిశీలన

ప్రధాన గోపురం నుంచి గ్రామోత్సవానికి బయలుదేరిన ఒంటిమిట్ట రామయ్య

హంస వాహనంపై ఊరేగుతున్న స్వామివారు... గ్రామోత్సవంలో ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, సూపరింటెండెంట్‌ హనుమంతయ్య

ఒంటిమిట్ట: ఏకశిలానగరిలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంసవాహన సేవ కనులపండువగా సాగింది. రాయంచపై రాములోరు కొలువై మాడ వీధుల్లో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అంతకుముందు సీతారామలక్ష్మణ మూర్తులను పట్టువస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలికలతో సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ డిప్యూటీ ఈఓ ప్రశాంతి ఆధ్వర్యంలో సాగిన ఈ సేవలో వేలాది మంది భక్తులు పాలుపంచుకున్నారు. కోలాటం బృందం నృత్య ప్రదర్శనలు, తాళ భజనలు, మంగళవాయిద్యాలు ముందు సాగుతుండగా రాచఠీవితో హంస వాహనంపై నిలిచిన రాములవారు ఒంటిమిట్ట వీధుల్లో విహరించారు.హారతి కర్పూరాలతో భక్తులు తమ కోర్కెలు తీర్చాలని రాములవారికి ప్రణమిల్లారు. భక్తుల విన్నపాలను ఆలకిస్తూ..అభయమిస్తూ ..జీవన విధానానికే ఒకే సందేశమిస్తూ స్వామివారు ముందుకు కదిలారు.

వేణుగానాలంకారంలో..

అంతకుముందు ఉదయం స్వామివారు వేణుగానాలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. భక్తజన బృందాలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయి ద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. తిరిగి సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్‌ సేవ వైభవంగా జరిగింది.

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 1న జరిగే సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, టీటీడీ అడిషనల్‌ ఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అన్నారు. శనివారం వారు ఒంటిమిట్ట కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చేందుకు ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను, ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం స్థానిక టీటీడీ పరిపాలన భవనంలో టీటీడీ, జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీటీడీ, జిల్లా యంత్రాంగం అధికారులు సమన్వయం చేసుకుని, సమిష్టికిగా పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ సమర్థవంతంగా పనిచేయాలన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేసేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా జేసీ నిధిమీనా, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ భావన, రాజంపేట ఏఎస్పీ మనోజ్‌ రామనాథ్‌ హెగ్దె, టీటీడీ, జిల్లా యంత్రాంగం అధికారులు పాల్గొన్నారు.

కనుల పండువగా హంస వాహన సేవ

రామయ్య సన్నిధిలో ప్రణమిల్లిన భక్తజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement