తాగునీటి సమస్యపై ఆందోళన
● అరటి రైతులను ఆదుకోవాలి
● జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం
కడప సెవెన్‌రోడ్స్: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు తక్షణమే చేపట్టాలని, జిల్లాలో అకాల వర్షాలతోపాటు పశ్చిమాసియా సంక్షోభం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి కోరుతూ జిల్లా పరిషత్‌సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. శనివారం జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది.
‘సీమ’జీవనాడి ఎత్తిపోతల
తెలుగుగంగ, జీఎన్‌ఎస్‌ఎస్, కేసీ కెనాల్, ఎస్‌ఆర్‌బీసీ తదితర సాగునీటి ప్రాజెక్టులకు జీవనాడి అయిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను తక్షణమే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయాలంటూ ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా దిండి, పాలమూరు–రంగారెడ్డి పథకాలను చేపట్టి 100 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోతోందని తెలిపారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా అల్మట్టి ఎత్తు పెంచుతోందన్నారు. ఈ నేపధ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉపయోగం లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సీమ ఎత్తిపోతలకు అనుమతులు లేవంటున్న టీడీపీ నేతలు పట్టి సీమను ఎలా చేపట్టారని ప్రశ్నించారు. కూటమి పార్టీలకు 21 మంది ఎంపీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించకపోవడం వల్ల పర్యావరణ అనుమతులు రాని పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు.సీమ ఎత్తిపోత పనులు తిరిగి చేపట్టాలని కోరుతూ తీర్మానం చేసేందుకు తొలుత ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అభ్యంతరం చెప్పినా చివరకు అంగీకరించక తప్పలేదు. తమ పార్టీ కూడా మద్దతు ఇస్తుందని తెలిపా రు. జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల అరటి రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారన్నారు. అలాగే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపధ్యంలో ఎగుమతులు నిలిచిపోవడం వల్ల ధరలు దారుణంగా పడిపోయాయన్నారు. ఈ పరిస్థితుల్లో అరటి రైతులను ఆదుకునేందుకు ప్రభు త్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ ఆయన ప్రతిపాదించిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది.
సోలార్ భూములకు పరిహారం ఇవ్వాలి
పోరుమామిళ్ల మండలం చెర్లోపల్లె సర్వే నెంబరు 676లో బీసీ, ఎస్సీ పేదలు 51.67 ఎకరాల భూమిని చాలాకాలంగా సాగు చేసుకుంటున్నారని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ తెలిపారు. ఆ భూములను సోలార్ ప్రాజెక్టు యాజమాన్యానికి తహసీల్దార్ అప్పగించారని చెప్పారు. ఇప్పుడు సోలార్ యాజమాన్యం రైతుల భూములను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైందన్నారు. రైతులకు న్యాయం చేయాలని ఆమె కోరారు. కలెక్టర్ బదులిస్తూ ఆ భూములు ఎస్సీ, బీసీలకు అసైన్‌మెంట్ ఇవ్వలేదని తెలిపారు. అందుకే సోలార్ ప్రాజెక్టుకు ఇచ్చామన్నారు. నిజంగా ఆ భూములుసాగు చేస్తున్నారా? లేదా? అని ఆర్డీఓ విచారణ నిర్వహిస్తారన్నారు.
దౌర్జన్యంగా భూముల స్వాధీనం
ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ పెద్దముడియం మండలం కల్వటాల గ్రామంలో సోలార్ ప్లాంటు పనులను చేపడుతున్నారని తెలిపారు. రైతులతో అగ్రిమెంటు లేకుండా, లీజు లేకుండా, డబ్బులు ఇవ్వకుండా పట్టా భూముల్లో కూడా దౌర్జన్యంగా పనులు చేపట్టారని ఆరోపించారు.
● పోరుమామిళ్ల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ మాట్లాడుతూ తమ మండలంలో 16 ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురయ్యాయన్నారు. ఇందువల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఖాళీగా ఉన్న విద్యుత్ ఏఈ పోస్టులు భర్తీ చేయాలని వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి కోరారు.
కారుణ్య నియామకాలపై చర్చ: జిల్లా పరిషత్‌లో బోగస్ సర్టిఫికెట్లతో కారుణ్య ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు పత్రికల్లో వస్తున్నాయని, దీనిపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి కోరారు. 10మంది అనర్హులు బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినమాట నిజమేనని జెడ్పీ సీఈఓ ఓబులమ్మ తెలిపారు. జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి మాట్లాడుతూ ఇన్నాళ్లు జీతాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బీమా, పంట రుణాలపై వాగ్వివాదం
పంటలు నష్టపోయిన రైతులకు రావాల్సిన బీమా సొమ్ములు ఇప్పించాలని వీఎన్ పల్లె ఎంపీపీ రఘునాథరెడ్డి కోరారు. జిల్లాకు బీమా కింద మంజూరైన రూ.173 కోట్లు ఎక్కడుందో చెప్పాలంటూ నిలదీశారు. దీనిపై డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఒకే డీకేటీ భూమిపై నలుగురు రుణాలు గతంలో పొందారని తెలిపారు. బద్వేలులో ఒకరు అరెస్టు కూడా అయ్యారని పేర్కొన్నారు. దీనిపై బద్వేలు జెడ్పీటీసీ చిన్న పోలిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2025 ఖరీఫ్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ. 25 కోట్లు బీమా విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కోరారు. కడప వ్యవసాయ మార్కెట్ యార్డులో జంబోషెడ్, టాయిలెట్లు నిర్మించాలని కో ఆప్షన్ సభ్యుడు కరీముల్లా కోరారు.
● ఈ సమావేశంలో జెడ్పీ ఉపాధ్యక్షులు జేష్ఠాది శారద, పిట్టు బాలయ్య యాదవ్, జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న
ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి
ఎమ్మెల్సీ
రమేష్‌యాదవ్
వీఎన్ పల్లె ఎంపీపీ రఘునాథరెడ్డి
ఎమ్మెల్సీ
రామచంద్రారెడ్డి
తాగునీరు లేక అనేక గ్రామాల ప్రజలు అలమటిస్తున్నారని చక్రాయపేట జెడ్పీటీసీ శివప్రసాద్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వెలిగల్లు నుంచి తమ మండలంలోని గ్రామాలకు నీరిచ్చే పథకాలను చేపట్టాలన్నారు. మెగా కంపెనీ అలసత్వం కారణంగా పులివెందుల తాగునీటి పథకం నుంచి తమకు నీరు రావడం లేదన్నారు. ఇందుకు కలెక్టర్ బదులిస్తూ 35 కిలోమీటర్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేయిస్తామన్నారు. వీరితో పాటు పలువురు జెడ్పీటీసీలు తాగునీటి సమస్యపై గళమెత్తారు.


