కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం ఆదివారం సెలవు దినం అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ బిల్లుల వసూ లు కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయని ఏపీఎస్‌పీడీఎల్ పర్యవేక్షక ఇంజినీరు ఎస్. రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలని కోరారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ఏసీఏ సౌత్‌జోన్ మెన్ అండర్–23 అంతర్ జిల్లాల వన్డే మ్యాచ్‌లు నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎ. రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఈ మ్యాచ్‌లు వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియం, కేఓఆర్‌ఎం మైదానంలో జరుగుతాయని వివరించారు.
కడప ఎడ్యుకేషన్: కడప ప్రభుత్వ పురుషుల కళాశాల ఏపీ ఎస్‌ఎస్‌డీసీ సౌజన్యంతో ప్రభుత్వ పురుషుల కళాశాల(స్వయంప్రతిపత్తి)లో జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ) ఆధ్వర్యంలో ఈ నెల 30న సోమవారం జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎం. రవి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా లోని ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు, డిగ్రీ , పీజీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేశారు. వివరాలకు కళాశాలలోని జేకేసీ కోఆర్డినేటర్ రాము (7995802325), మెంటార్లు సారధి (9347256400), రవీంద్రారెడ్డి (93900 52901)లను సంప్రదించాలని తెలిపారు.
కడప సెవెన్‌రోడ్స్: జిల్లా రెవెన్యూ అధికారిగా మల్లికార్జున శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా మల్లికార్జునను ప్రభుత్వం కడప డీఆర్వోగా నియమించింది. ఈ మేరకు కలెక్టరేట్‌కు చేరుకుని తన చాంబర్‌లోగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆయనను ఆహ్వానించారు. అనంతరం నూతన డీఆర్వో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ అంశాలపై చర్చించారు.
కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం ఆ శాఖ జిల్లా అధికారి డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో జిల్లా పీసీపీ పీఎన్డీటీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ డిస్టిక్ లెవెల్ అడ్వైజరీ కమిటీ మాతృ మరణాలపైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు, ఇకమీదట ఎలాంటి మాతృ మరణాలు సంభవించరాదన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ హిమదేవి, ప్రోగ్రాం ఆఫీసర్ అరిఫుల్లా, సీ్త్ర వ్యాధి నిపుణురాలు డాక్టర్ లక్ష్మీ సుశీల, రేఖా రావు, మత్తు వ్యాధి నిపుణులు డాక్టర్ సునీల్, డాక్టర్ యాదవేందర్ రెడ్డి, డాక్టర్ అబ్దుల్ కలీఫ్, శోభారాణి పాల్గొన్నారు.
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్‌కు దేశంలో ప్రముఖ ఇంజినీరింగ్ ప్రొఫెషనల్ సంస్థ ది ఇన్ట్సిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా ప్రతిష్టాత్మకమైన ఫెలో ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ సభ్యత్వాన్ని ప్రదానం చేశారు. ఇంజినీరింగ్ రంగంలో అత్యున్నత సభ్యత్వంగా పరిగణించబడే ఈ ఫెలోషిప్, ఇంజినీరింగ్, సాంకేతికత, పరిశోధన , విద్యా రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ప్రదానం చేస్తారు. కాగా ఆచార్య రాజశేఖర్ మూడు పీహెచ్‌డీలతో పాటు నాలుగు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు సంపాదించి, మూడు దశాబ్దాలుగా ఉన్నత విద్యా రంగంలో సేవలు అందిస్తున్నారు.


