ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కొత్త భయం పట్టుకుందా..? | Kadapa MLA Madhavi Reddy Comments On Covert Agents | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కొత్త భయం పట్టుకుందా..?

Mar 30 2026 12:14 PM | Updated on Mar 30 2026 12:27 PM

Kadapa MLA Madhavi Reddy Comments On Covert Agents

 పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్య  

ఇప్పటికే సీనియర్లకు ప్రాధాన్యత లేదని కేడర్‌లో ఆవేదన   

సాక్షి ప్రతినిధి, కడప: కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కొత్త భయం పట్టుకుందా..? తన కోటరీలోనే కోవర్టులున్నారనే దిగులు మనసును తొలిచేస్తోందా? .. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ‘నా చుట్టూ కోవర్టులున్నారు...వాళ్ల పగలు పార్టీలో పని చేసి రాత్రి  వైఎస్సార్సీపీ వాళ్లతో టచ్‌లో ఉన్నార’ంటూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున స్వయనా ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన కామెంట్స్‌ ఇప్పుడు టీడీపీలో కాక పుట్టిస్తున్నాయి. తన కోటరీలోనే ఉన్న ఆ కోవర్టులు ఎవరు? అనే అంశంపై పార్టీలో తీవ్ర చర్చనడుస్తోంది. కాగా తొలినాళ్ల నుంచి టీడీపీ జెండాను మోసిన వారిని పక్కన పెట్టారని ఆపార్టీ నేతలు కొందరు బాహాటంగా చెప్పుకొస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఫిరా యించిన వారికి పెద్ద పీట వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తన చుట్టూ ఉన్న వారిలో కోవర్టులు ఉన్నారంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. 

⇒ కడప టీడీపీలో జోష్‌ తగ్గిపోయింది. నేతల మధ్య అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. పార్టీ పరిస్థితి అట్టుడుగు స్థానానికి వచ్చిందని గతంలో సీనియర్‌ నాయకులంతా ప్రెస్మీట్లు పెట్టి మరీ విమర్శలు చేశారు. ఎమ్మెల్యే తీరుపై అనేక మంది నాయకులు అభ్యంతరాలు కూడా తెలిపారు. నలభై ఏళ్లుగా పార్టీ జెండాను మోస్తున్న టీడీపీ సీనియర్‌ నాయకులను ఎమ్మెల్యే పక్కన పెట్టేసిందని ఆరోపించారు.  దాదాపు పాతతరం టీడీపీ నేతలంతా ఎమ్మెల్యేకు దూరంగానే ఉంటున్నారు.  ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గెలిచిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని తన వెనుక తిప్పుకుంటూ ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకున్నారు. ఇది మొదటి నుంచీ టీడీపీలో ఉన్నవారికి రుచించడం లేదు.  

కనుమరుగవుతున్న పాతతరం నేతలు... 
సాక్షాత్తు టీడీపీ నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్న శివకొండారెడ్డిపై ప్రత్యక్ష దాడి చోటుచేసుకుంది. తాజాగా వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిన వారు ఓ డివిజన్‌ టీడీపీ ఇంఛార్జి వెంకటేష​పై మూకుమ్మడి దాడి చేశారు. కీలక నేతల పరిస్థితి  ఘోరంగా తయారైంది. ఇప్పుడంతా వేరే పార్టీ నుంచి వచ్చిన వారిదే కడప టీడీపీలో పెత్తనం అంటూ పాత తరం నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో ఎమ్మెల్యే కోవర్టులంటూ వ్యాఖ్యలు చేయడం పార్టీలో పెద్ద దుమారాన్ని లేపింది. కొత్తగా వచ్చిన నేతలేమో..పాత తరం వారే కోవర్టులని సర్దిచెప్పుకుంటుంటే...పాత తరం వారు మాత్రం వేరే పార్టీ నుంచి వచ్చిన వారే కోవర్టులంటూ చెప్పుకొస్తున్నారు.  

ఎన్‌టీఆర్‌ను విస్మరించిన తమ్ముళ్లు...
 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున  దివంగత ఎన్‌టీఆర్‌ను తెలుగుతమ్ముళ్లు విస్మరించారు. కడప నగరంలోని కొండాయపల్లె (చిన్నచౌక్‌ పోలీసుస్టేషన్‌ ఎదురుగా) వద్ద ఉన్న ఎనీ్టఆర్‌ విగ్రహం కనీసం ఒక పూలదండకు కూడా నోచుకోలేదంటే పార్టీ నేతల చిత్తశుద్ధి ఏంటో ఇట్టే అర్థమవుతోంది.   కాగా, కడప నగరంలో 15 డివిజన్లు మినహా తక్కిన డివిజన్లలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా చేపట్టలేదని సమాచారం.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement