ఒంటిమిట్ట : ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి రానున్నట్లు ఆదివారం వైఎస్సార్‌సీపీ ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీతారామలక్ష్మణులను వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డితో కలిసి ఎంపీ దర్శించుకుంటారన్నారు. ఉదయం 8:30 గంటలకు ఒంటిమిట్టకు చేరుకోనున్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక కళాభారతి కార్యాలయంలో ఆదివారం సంస్థ ఎన్నికలను నిర్వహించారు. సంస్థ అధ్యక్షులుగా కొత్తపల్లి శీను, ప్రధాన కార్యదర్శిగా సుభాష్‌చంద్రబోస్, ట్రెజరర్‌గా సోమశేఖర్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా ఏవీ శేఖరాచారి, జీవీ సుబ్బారెడ్డి, డి.శివప్రసాద్, గౌరీశంకర్, శశిరాజా ఆచారిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కొత్తపల్లి శీను మాట్లాడుతూ 49 ఏళ్లుగా కళాభారతి నాటక సంస్థను నడిపిస్తున్నట్లు తెలిపారు. ఇంకా మంచి నాటక ప్రదర్శనలు ఇచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
రిమ్స్‌లో గుర్తు తెలియని
మృతదేహాలు
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో ఈనెల 27న గుర్తు తెలియని వ్యక్తులను వైద్యపరీక్షల కోసం వేర్వేరు సమయాల్లో తీసుకుని వచ్చారు. వారికి పరీక్షలను నిర్వహించగా చనిపోయారని వైద్యు లు నిర్ధారించారు. రెండు గుర్తు తెలియని మృతదేహాలను మార్చురీలో ఉంచారు. వారి ఆచూ కీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు.
భార్యభర్తలపై దాడి
చాపాడు: మండల పరిధిలోని పెద్ద గురువలూరు గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన పాలగిరి సత్య వేమారెడ్డి, అతని భార్య పద్మావతి పై ప్రొద్దుటూరులో నివాసముంటున్న రామిరెడ్డి వీరారెడ్డి అలియాస్ పోలీసు వీరారెడ్డి కొంతమంది వ్యక్తులతో కలిసి దాడి చేసినట్లు ఇన్‌చార్జి ఎస్‌ఐ ధనుంజయ తెలిపారు. శ్రీరామనవమి పండుగ అనంతరం శనివారం రాత్రి రామాలయం వద్ద జరిగిన హుండీ లెక్కింపు కార్యక్రమం వద్ద వీరారెడ్డి, సత్య వేమారెడ్డి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం వీరారెడ్డి మరి కొంతమంది వ్యక్తులతో కలిసి సత్యవేమారెడ్డి ఇంటిపైకి వెళ్లి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పద్మావతి చేతికి తీవ్ర గాయమైంది. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఇన్‌చార్జి ఎస్‌ఐ తెలియజేశారు.
ఒంటిమిట్టకు 85,000 శ్రీవారి లడ్డూలు
ఒంటిమిట్ట : ఏప్రిల్ 1న జరిగే ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి ఆదివారం తిరుమల నుంచి 85,000 శ్రీవారి లడ్డూలు పంపినట్లు ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి తెలిపారు. తిరుమల ఎస్టేట్స్ ఆఫీసర్, పరకామణి డిప్యూటీ ఈవో వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో తిరుమల శ్రీవారి లడ్డూలు ప్యాకింగ్ జరిగింది. కార్యక్రమంలో 300 మంది సేవకులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో
ఎలక్ట్రీషియన్ మృతి
పీలేరురూరల్ : విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి చెందిన సంఘటన ఆదివారం పీలేరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం బండ్లవంకకు చెందిన ఎస్. వంశీకృష్ణ (40) ఎలక్ట్రీషియన్ పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఆదివారం స్థానిక తిరుపతి రోడ్డు మార్గంలో కల్యాణమండపం వద్ద మరమ్మతులు చేస్తూ విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యుగంధర్ తెలిపారు.


