ప్రశ్నిస్తే బురద జల్లడం మీ పాలన అసలు స్వరూపం | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నిస్తే బురద జల్లడం మీ పాలన అసలు స్వరూపం

Mar 30 2026 8:37 AM | Updated on Mar 30 2026 8:37 AM

పులివెందుల : పని చేయకుండా అప్పులు తీసుకుని అవినీతికి పాల్పడుతూ ప్రజల డబ్బు దోచుకుని, ప్రశ్నిస్తే దాన్ని మళ్లించేందుకు బురదజల్లడం మీ పాలన అసలు స్వరూపమని, డైవర్షన్‌లో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం పేరిట, రెండోవిడత పూలింగ్‌ పేరిట చేసిన డ్రామాను ప్రజలు గమనిస్తున్నారని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పులివెందులలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేం ఇప్పటికీ చెబుతున్నది ఒక్కటే...అధికారంలో మీరు ఉన్నారు...మిమ్మల్ని అడ్డుకునే వారు ఎవరూ లేరు.. ఎలాంటి అడ్డంకులు లేవు...కానీ మీరు చెబుతున్న పనులు మాత్రం కనిపించడం లేదన్నారు. పైగా ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు 2028లోపు రాజధాని పూర్తిచేస్తామని చెబుతున్నారని, మరి అదే సమయంలో ‘‘ఎవరైనా మార్చేస్తారు’’అనే ప్రచారం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇది మీకు మీపై నమ్మకం లేదనే సంకేతం కాదా అని ప్రశ్నించారు. కట్టలేరని మీరే అంగీకరిస్తున్నట్టే కదా అని అన్నారు. అసెంబ్లీ తీర్మానాలు చేసి డ్రామాలు చేయడం ఎందుకు? కౌన్సిల్‌ను పక్కన పెట్టడం ఎందుకు? భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. ప్లాట్ల డెవలప్‌మెంట్‌ లేదు, రోడ్లు లేవు, కొన్ని ప్లాట్లు చెరువుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. తమ ప్లాట్‌ ఎక్కడుందో తెలియని స్థితిలో రైతులు ఉన్నారన్నారు. కుటుంబ అవసరాలు తీర్చుకోలేక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, మిమ్మల్ని ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. రెండో విడత పూలింగ్‌కోసం ఎత్తుగడలో భాగంగా ఈతీర్మానం డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని...ఎవరు అడ్డుపడ్డారు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

మళ్లీ టెండర్లు పిలవడమేంటి..?

మొదటి దశలోనే 50,000 ఎకరాలు తీసుకున్నారని, ఒక్కో ఎకరా అభివృద్ధికి రూ.2 కోట్లు అంటే రూ లక్ష కోట్లు అవసరమన్నారు. రెండో దశలో మరో 20,500 ఎకరాలకు రూ.40–50 వేల కోట్లు. మరో 25,000 ఎకరాలకు రూ.50 వేల కోట్లు ఇలా మొత్తం ఖర్చు భారీగా పెరుగుతోందన్నారు. మొత్తంగా కనీస సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు అవసరమని, ఇంకా అదనంగా మాస్టర్‌ ప్లాన్‌ పేరిట మరింత భూములు అమసరమని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఇది సాధ్యమా అనే ప్రశ్న సహజంగా ఉత్పన్నమవుతుందని తెలిపారు. 2014–19లో రూ.5,000 కోట్లే ఖర్చు చేశారని, ఇప్పుడు కూడా పెద్దగా పనులు కనిపించడం లేదన్నారు. కొత్త భవనాలు కట్టకుండా, డిజైన్‌ల పేరుతో రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. పాత టెండర్లను రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవడం అనుమానాస్పదంగా ఉందని ఎంపీ అన్నారు. ఏడేళ్లలో చంద్రబాబు చేసింది ఏమీ లేకపోగా, కొత్తగా ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ కూడా కట్టలేదని పేర్కొన్నారు. టెండర్లు కొద్దిమంది కంపెనీలకే ఇవ్వడం, 4 శాతం ఎక్సెస్‌తో పనులు ఇవ్వడం అనేది అవినీతికి పరాకాష్ట అని అన్నారు. స్క్వేర్‌ ఫీట్‌కు రూ.11,000 ఖర్చు అంటే చివరికి ఎంత అవుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్ట్‌ అని చెబుతున్నారని, అయితే ఎందుకు రూ.47,000 కోట్ల అప్పులు తీసుకున్నారో? ఎందుకు ప్రభుత్వ గ్యారంటీలు? భూములు అమ్మి డబ్బు తెస్తామని చెప్పిన వారు ఇప్పటివరకు ఎంత సంపాదించారు? తెచ్చిన అప్పులను ఎవరు తీరుస్తారు? ఏడేళ్లలో ఇప్పటివరకూ ఒక్కపైసా కూడా రాబడిలేదు. మరి ఈ భారం ఎవరిమీద వేస్తారని ప్రశ్నించారు.

నత్త నడకన పనులు

2024 జూన్‌ తర్వాత డ్రా చేసిన రూ వేల కోట్ల రుణాల్లో రూ.5,000 కోట్లు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌గా ఇచ్చారని, ఇవి కమీషన్ల రూపంలో వెళ్లాయనే ఆరోపణలు ఉన్నాయని, అందుకే పనులు నత్తనడకగా సాగుతున్నాయని ఎంపీ తెలిపారు. మీ అవినీతి వ్యవహారాలు చూసి రైతులు కూడా రెండో దశలో భూములు ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నాని అన్నారు. టెంపరరీ అసెంబ్లీ, టెంపరరీ హైకోర్టు పేరుతో సుమారు రూ.1000 కోట్లు ఖర్చు చేశారని, శాశ్వత పరిష్కారం లేకుండా ఇలా డబ్బు ఖర్చు చేయడం ఎందుకని ప్రశ్నించారు. కొత్తగా నిర్మాణాలు లేకుండా, కనెక్టివిటీ కూడా అభివృద్ధి జరగదని, ఇప్పటికీ కరకట్ట రోడ్డే ప్రధాన మార్గమని తెలిపారు. కొన్ని పనులు గత ప్రభుత్వ కాలంలోనే పూర్తయ్యాయని, వెస్ట్రన్‌ బైపాస్‌ కట్టింది జగన్‌మోహన్‌రెడ్డి కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు లక్ష్యం రాజధాని నిర్మాణం కాదని, దాని పేరుతో సంపద సృష్టించడం. తన అనుచరులు, బినామీలకు లాభం చేకూర్చడమే అసలు ఉద్దేశమన్నారు. ఆర్‌టీఐ ద్వారా అడిగినా సమాచారం ఇవ్వడం లేదని,అమరావతి ప్రాజెక్ట్‌లో పారదర్శకత లేదన్నారు. వైఎస్సార్‌ సీపీ అభివృద్ధి వికేంద్రీకరణలో అమరావతిని వ్యతిరేకించలేదన్నారు. అభ్యంతరం అవినీతి మీద మాత్రమేనని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా అమరావతిలో ఇల్లు కట్టుకున్నారని, అమరావతి ప్రాంతంపై వ్యతిరేకత లేదనేది స్పష్టమన్నారు.అమరావతి పనులపై రూ.2,000 కోట్ల అవినీతి ఆరోపణలతో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసులు వచ్చాయని, పీఏ శ్రీనివాస్‌ పేరుతో కమీషన్లు వెళ్లాయని పేర్కొన్నారు. ఇది పెద్ద అనుమానాలకు దారితీస్తోందన్నారు. భవిష్యత్తులో నిర్మించే భవనాల నిర్వహణ ఖర్చులు కూడా భారీగా ఉంటాయని, ఆచరణాత్మక ఆలోచన లేకుండా భారీ ప్రాజెక్టులు ప్రకటించడం ప్రజల్లో భయం కలిగిస్తోందని ఎంపీ పేర్కొన్నారు.

డైవర్షన్‌లో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం పేరిట డ్రామా

సీఎం చంద్రబాబుకు రాజధానిపై చిత్తశుద్ధి లేమి

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement