● జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
● కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది,
కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష
కడప అర్బన్ : సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపర్చి బాధితులకు న్యాయం జరిగేలా, సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని కోర్టు మానిటరింగ్ సిబ్బంది, పోలీస్ స్టేషన్‌లకు చెందిన కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు నివేదించాలని ఆదేశించారు. పెండింగ్ ట్రయల్ కేసుల్లో సత్వర, సక్రమ విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పరచడం, వారికి ధైర్యం చెప్పి శిక్షల శాతం పెంచేలా కృషి చేయాలని సూచించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లతో, న్యాయ వ్యవస్థతో వృత్తి పరమైన సత్సంబంధాలు కొనసాగిస్తూ మరింత మెరుగైన ఫలితాలు వచ్చేలా చూడాలని చెప్పారు. కోర్టులలో ఛార్జ్‌షీట్ ఫైల్ చేసిన అనంతరం కోర్టు ద్వారా సంబంధిత కేసులలో సి.సి నంబర్లను తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పెండింగ్ సమన్లు జారీ అయ్యేలా, వారెంట్లు అమలు జరిగేలా తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నూతనంగా అమలులోకి వచ్చిన బి.ఎన్.ఎస్.ఎస్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కొత్త చట్టం మేరకు కోర్టు ప్రొసీడింగ్స్ జరిగేలా చూడాలని ఆదేశించారు. ప్రతి కోర్టు కానిస్టేబుల్ విధిగా తన పోలీస్ స్టేషన్‌కు సంబంధించి కోర్టులో హాజరవుతున్న ప్రతి కేసు గురించి అవగాహన పెంచుకుని సరైన సాక్షాధారాలతో నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. కోర్టు ట్రయల్ సందర్భంలో సంబంధిత స్టేషన్ హౌస్ అధికారి కూడా సమర్థవంతంగా కేసు విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. ఈ సమావేశంలో కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్‌స్పెక్టర్ ఎస్.వినయ్ కుమార్‌రెడ్డి, డి.సి.ఆర్.బి ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి, కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


