
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలి
కడప అగ్రికల్చర్: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని ఏడీఏలకు, ఆత్మ సిబ్బందికి జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ సూచించారు. గురువారం ఊటుకూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ వారు ఉమ్మడి జిల్లాలోని అన్ని డివిజన్ల సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) ఆత్మ సిబ్బందికి సహజ, సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ మాట్లాడుతూ సాంకేతిక యాజమాన్య సంస్థ ద్వారా సహజ సేంద్రియ వ్యవసాయ పద్ధతులలో ప్రదర్శన క్షేత్రాలు, శిక్షణ కార్యక్రమాలు, రైతు క్షేత్ర పాఠశాలలు నిర్వహించి ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కృషి విజ్ఞాన కేంద్ర వ్యవసాయ పర్యవేక్షణ శాస్త్రవేత్త శిల్పకళ ప్రకృతి వ్యవసాయంలో వివిధ పద్దతులలో వరి, కంది, వేరుశనగ, పత్తిలో చీడపీడల యాజమాన్యం గురించి అవగహన కల్పించారు. ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ విజయలక్ష్మి మాట్లాడారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలకు చెందిన డివిజన్ల ఏడీఏలు, ఆత్మ సిబ్బంది పాల్గొన్నారు.
ఎరువుల కొరత నివారణకు చర్యలు
జిల్లాలో ఎరువుల కొరత నివారణకు చర్యలు తీసుకున్నామని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ సూచించారు. గురువారం కడప కలెక్టరేట్‌లోని వ్యవసాయ కార్యాలయ సమావేశ మందిరంలో ఎరువుల హోల్‌సేల్ డీలర్లు, కంపెనీ సేల్స్ ఆఫీసర్లకు ఎరువుల సరఫరాపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల కంపెనీ యాజమాన్యం రాష్ట్ర కమీషనరేట్‌కు ఇచ్చిన ప్రకారం ఎరువులను సరఫరా చేస్తే ఎరువుల కొరత ఉండదన్నారు. కంపెనీ ఇచ్చిన ఇండెంట్ ప్రకారం ఎరువులను సరఫరా చేయాలని కోరారు. అలాగే జిల్లాలోని ఎరువుల హోల్‌సేల్ డీలర్లు కూడా జిల్లాలోని ఎరువుల వ్యాపారులకు మాత్రమే ఎరువులను సరఫరా చేయాలన్నారు. మార్క్‌ఫెడ్ డీఎం పరిమళజ్యోతి, జేడీఏ కార్యాలయ టెక్నికల్ ఏవో గోవర్థన్, ఎరువుల హోల్‌సేల్ డీలర్లు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లాకు యూరియా రాక
జిల్లాకు గురువారం 1300 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్లు జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ తెలిపారు. ఇందులో 1025 మెట్రిక్ టన్నులు వైఎస్సార్ జిల్లాకు కేటాయించగా 500 మెట్రిక్ టన్నులను మార్క్‌ఫెడ్‌కు, మరో 525 మెట్రిక్ టన్నులను ప్రైవేటు డీలర్ల్లకు కేటాయించినట్లు తెలిపారు. అలాగే మరో 275 మెట్రిక్ టన్నులను అన్నమయ్య జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో 150 మెట్రిక్ టన్నులను మార్క్‌ఫెడ్‌కు కేటాయించగా మరో 125 టన్నులను ప్రైవేటు డీలర్లకు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాకు వచ్చిన ఎరువులను జేడీఏ కార్యాలయ టెక్నికల్ ఏవో గోవర్థన్‌తో కలిసి రైల్వే స్టేషన్‌లో ఆయన యూరియాను పరిశీలించారు.
జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్