అరుదైన యోగ రామాలయం | - | Sakshi
Sakshi News home page

అరుదైన యోగ రామాలయం

Jun 16 2025 5:43 AM | Updated on Jun 16 2025 5:43 AM

అరుదై

అరుదైన యోగ రామాలయం

కడప కల్చరల్‌ : కడప జిల్లాలో విశిష్టమైన రామాలయం ఉంది. వల్లూరు మండలం పెద్దపుత్త గ్రామంలో యోగ రామాలయంగా ప్రసిద్ధి చెందింది. అత్యంత పురాతనమైనదిగా భావిస్తున్న ఈ ఆలయానికి దాదాపు 600 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు జిల్లాను పాలించిన చోళులు ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఇందులో మిగతా ఆలయాల్లో లాగా సీతారాములు నిలుచొని ఆశీర్వదించే భంగిమలో కనిపించడం లేదు. కేవలం యోగ ముద్రలో మూర్తులు కనిపిస్తున్నారు. ప్రతి రామాలయంలో సీతారాములు నిలుచొని ఆశీర్వదిస్తున్న భంగిమలో మూలమూర్తులు ఉంటాయి. కానీ మన జిల్లాలోని ఈ రామాలయంలో రాముడు, సీతమ్మ యోగ ముద్రలో కూర్చొని ఉన్న మూలమూర్తులను చూడవచ్చు. ఇలాంటి విశిష్టత గల ఆలయం ఇదొక్కటే అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నెల 21న ప్రపంచ యోగ దినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో యోగ ముద్రలో ఉన్న శ్రీరామచంద్రస్వామి గురించి ప్రత్యేక కథనం.

పరిశోధకుల పరిశోధన

పెద్దపుత్తలోని రామాలయంలో శ్రీరాముని ధనుర్భాణాలు లేవు. రాముడు పద్మాసనంలో యోగ ముద్రలో కనిపిస్తుండటం విశేషం. రాముడి కుడి చేతి బొటన వేలు, చూపుడు వేలు కలిపి ఉంచిన చిన్ముద్రలో కనిపిస్తారు. భూమి స్పర్శ ముద్రతో భూమిని నేలను తగులుతున్నట్లుగా ఉంది. రాముడే కాక సీతమ్మ కూడా రాముడికి ఎడమ వైపున కూర్చొన్న భంగిమలో మనం చూడవచ్చు. చేతిలోని పద్మాన్ని ధరించి ఉండటం కనిపిస్తుంది. లక్ష్మణుడు మాత్రం ధనుర్భాణాలతో శ్రీరామునికి కుడి వైపు నిలుచొని ఉన్నారు. ఈ ఆలయంలో ఆంజనేయులు కూడా తన ప్రత్యేకత చాటుకున్నారు. ఆయన శ్రీరాముని విగ్రహానికి ఎదురుగా యోగ ముద్రలో చేతిలో తాళ పత్రాలతో కనిపిస్తారు. ఇలాంటి విగ్రహాలు తమిళనాడులోని జలదుర్గ ప్రాంతంలో ఉన్నట్లు పరిశోధకుల సమాచారం. అనంతపురంలోని శింగనమల రామాలయంలో కూడా దాదాపు ఇవే పోలికలు గల విగ్రహాలు ఉన్నట్లు యోగి వేమన విశ్వ విద్యాలయ పరిశోధకులు తెలుపుతున్నారు. ఆ బృందం సభ్యులందరూ ఈ ఆలయంతోపాటు పెద్దపుత్తలోని యోగ రామాలయాన్ని పరిశీలించారు. మూల విరాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తమిళనాడులోని అనంతపురంలో కూడా ఇలాంటి విగ్రహాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పరిశోధనలు కొనసాగితే మరిన్ని వివరాలు తెలుస్తాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇలాంటి పురాతన ఆలయాలు, విశిష్టత గల దేవతామూర్తుల విగ్రహాలు, శాసనాలు తదితర వారసత్వ సంపద కూడా వెలుగు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.

పురాణాల్లో..

రాముడు సీతమ్మ యోగ ముద్రలో ఉన్నట్లు కనిపించే దృశ్యాలను అధ్యాత్మ రామాయణంలో చూడవచ్చు. శ్రీరాముడు హనుమంతునికి తారక మంత్ర బ్రహ్మోపదేశం చేశారు. ఈ ఘట్టం ఆధారంగా పెద్దపుత్త యోగ రామాయణంలో మూల మూర్తులను రూపొందించి ఉండవచ్చని పరిశోధకులు తెలుపుతున్నారు. విశిష్టత గల ఈ రామాలయంలోని మూల మూర్తులను కాపాడుకోవాల్సిన అవసరం జిల్లా వాసులపై ఉంది.

పెద్దపుత్తలో విశిష్ట మూలమూర్తులు

యోగా ముద్రలో సీతారాములు

చోళుల నిర్మాణంగా పరిశోధన

అరుదైన యోగ రామాలయం1
1/2

అరుదైన యోగ రామాలయం

అరుదైన యోగ రామాలయం2
2/2

అరుదైన యోగ రామాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement