ఏపీ ఈఏపీ సెట్‌కు 2493 మంది హాజరు
కడప ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీ సెట్ ఆన్‌లైన్ పరీక్షలు బుధవారం రెండు సెషన్స్‌లో జరిగాయి. జిల్లావ్యాప్తంగా 2493 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కడపలో ఐదు పరీక్షా కేంద్రాలు, ప్రొద్దుటూరులోని మూడు పరీక్షా కేంద్రాలకుగాను 2621 మంది అభ్యర్థులకుగాను 128 మంది గైర్హాజరయ్యారు. ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్‌కు సంబంధించి 95.12 శాతం హాజరు నమోదయింది.
నేడు ఉద్యోగ మేళా
కడప ఎడ్యుకేషన్: కడప రిమ్స్ రోడ్డులోని స్పిరిట్స్ కాలేజీలో నవత ట్రాన్స్ పోర్ట్ కంపెనీ వారు వివిధ పోస్టులకు సంబంధించి గురువారం ఉద్యోగ నియామక ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆ కాలేజీ సంచాలకులు ఎంసీ రవీంద్ర తెలిపారు. ఈ ఇంటర్వ్యూలు ఉద యం 9 గంటల నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఇంటర్, డిప్లొమా, డీగ్రీ పాస్ అయినవారు అర్హులని తెలిపారు. ఇందులో పాల్గొనే అభ్యర్థులు తమ సర్టిఫికెట్స్, ఫొటోస్, బ్యాంకు అకౌంట్స్ తో హాజరు కావాలని.. వివరాలకు తమ కాలేజి ఉద్యోగ నియామక అధికారి ఫోన్ నెంబర్ 988525 0955ను సంప్రదించాలని సూచించారు.
జెడ్పీలో బదిలీలకు
దరఖాస్తుల ఆహ్వానం
కడప సెవెన్‌రోడ్స్: జిల్లా పరిషత్‌లో సాధారణ బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు నెంబరు 23, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, తేది 15.05.2025 మేరకు జూన్ 2వ తేదిలోపు సాధారణ బదిలీలు జరగనున్నాయి. ఒకేచోట ఐదేళ్లు పూర్తయిన ఎంపీడీఓలు, మినిస్ట్రీరియల్, నాల్గవ తరగతి సిబ్బంది అధికారుల అనుమతితో రిక్వెస్ట్ బదిలీ దరఖాస్తులు ఈనెల 25వ తేదీ సాయంత్రం 5.00 గంటల్లోపు జిల్లా పరిషత్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని సీఈఓ ఓబులమ్మ తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న చోట ఐదేళ్లు సర్వీసు పూర్తయిన వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. ఏదైనా రిక్వెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ కింద బదిలీ కావాలని కోరుకునే వారు కూడా దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. క్రమశిక్షణా చర్యలుగానీ లేదా శాఖాపరమైన చర్యలు ఉన్నవారు బదిలీకి అనర్హులవుతారు. సాధారణ బదిలీలపై వచ్చేనెల 3 నుంచి మళ్లీ నిషేధం అమలులోకి వస్తుందని వెల్లడించారు.
ఆర్‌డీఎస్‌ఎస్ పనుల్లో
వేగం పెంచాలి
కడప కార్పొరేషన్: రివాంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం(ఆర్‌డీఎస్‌ఎస్) కింద మంజూరైన పనులను వేగంగా పూర్తి చేయాలని ఏపీఎస్‌పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీర్ ఎస్. రమణ ఆదేశించారు. బుధవారం స్థానిక విద్యుత్ భవన్‌లో ఆర్‌డీఎస్‌ఎస్ పథకం కింద జరుగుతున్న పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ ఆర్‌డీఎస్‌ఎస్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో త్రీఫేస్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. ఈ పనులలో వేగవంతం పెంచాలని, తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు త్వరగా లబ్ధి చేకూరటమే కాకుండా విద్యుత్ వ్యవస్థ పటిష్టవంతంగా తయారవుతుందని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగరాజు, డీఈఈలు, ఏఈలు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


