దళారులకు చెక్‌.. రైతులకు గిట్టుబాటు ధర | - | Sakshi
Sakshi News home page

దళారులకు చెక్‌.. రైతులకు గిట్టుబాటు ధర

Oct 15 2026 11:47 AM | Updated on Oct 15 2026 11:47 AM

అందరికీ ఆదర్శంగా కొనుగోలు కేంద్రం

గుండాల : వ్యవసాయ రంగంలో మహిళలకు సరికొత్త అవకాశాలు కల్పిస్తూ గుండాల మండల కేంద్రంలో మహిళా ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీఓ)విశేష కృషి చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో ఏర్పాటైన ఈ సంస్థలో జిల్లాలోని 17 మండలాలకు చెందిన సుమారు 2,625 మంది మహిళా రైతులు వాటాదారులుగా ఉన్నారు. వీరంతా కలిసి గతేడాది వెల్మజాల గ్రామంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి లాభాల బాట పట్టారు.

మధ్యవర్తుల ప్రమేయం లేకుండా..

రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించాలనేది ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా 183 మంది రైతుల నుంచి 3,324 బస్తాల కందులను (1,660 క్వింటాళ్లు) కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన రూ. 1,32,96,000లను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేశారు. ఈ లావాదేవీల ద్వారా మహిళా ఉత్పత్తిదారుల సంస్థకు సుమారు రూ.1,32,960 కమీషన్‌ వచ్చింది.

ఈ–పాస్‌ యంత్రాలతో డిజిటల్‌ సేవలు

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో గుండాలలో ఎఫ్‌పీఓ సేవా కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. రైతులు సులభంగా తమకు కావాల్సిన వ్యవసాయ ఇన్‌పుట్‌ను తీసుకునేలా ఈ–పాస్‌ యంత్రంతో బుకింగ్‌, కొనుగోలు ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు.

భవిష్యత్‌ ప్రణాళికలు

భవిష్యత్తులో రైతుల అవసరాలకు అనుగుణంగా తమ సేవలను మరింత విస్తరించాలని మహిళలు ప్రణాళికలు రచిస్తున్నారు. పంటల సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌, వ్యవసాయ ఇన్‌పుట్‌ సరఫరా, రైతులకు శిక్షణ వంటి రంగాలలో సేవలను విస్తరిస్తాం అని సంస్థ డైరెక్టర్లు పోతారం భాగ్యమ్మ, మల్లం అనిత, బొమ్మగాని అంజమ్మలు తెలిపారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ సేవా కేంద్రంలోనే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

రైతులకు సకాలంలో మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడంతో పాటు ఎఫ్‌పీఓకు ఆదాయ మార్గం ఏర్పడటంతో ఈ మోడల్‌ విజయవంతమైంది. దీంతో చుట్టు పక్కల జిల్లాల నుంచి ఎఫ్‌పీఓ ప్రతినిధులు, అధికారులు ఇక్కడికి వచ్చి కొనుగోలు విధానాన్ని పరిశీలిస్తున్నారు.

లాభాల బాటలో గుండాల మహిళా ఉత్పత్తిదారుల సంస్థ

ఫ 2,625 మంది మహిళా రైతులే వాటాదారులు

ఫ నేరుగా కందుల కొనుగోళ్లు

ఫ రూ.1.32 కోట్లకు పైగా లావాదేవీలు

ఫ కమీషన్‌ రూపంలో రూ.1.32 లక్షల ఆదాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement