రెగ్యులరైజ్ చేయాలి
సమాన పనికి
సమాన వేతనం ఇవ్వాలి
భువనగిరి: వైద్య శాఖలో పనిచేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు సమ్మెకు దిగారు. వైద్యులు మొదలుకొని అటెండర్ల వరకు సుమారు 78 కేటగిరీలకు చెందిన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం తదితర తొమ్మిది ప్రధాన డిమాండ్లతో జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు.
వైద్య సేవలపై తీవ్ర ప్రభావం
జిల్లా వ్యాప్తంగా 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు), 142 సబ్ సెంటర్లు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, కమ్యూనిటీ, ఏరియా ఆసుపత్రుల్లో మొత్తం 362 మంది ఎన్హెచ్ఎం కింద విధులు నిర్వర్తిస్తున్నారు. రెగ్యులర్ సిబ్బందితో సమానంగా పనిచేస్తున్నా వేతనాలు తక్కువగా ఉన్నాయని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా పీహెచ్సీలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు వీరిపైనే ఆధారపడి కొనసాగుతున్నాయి. అలాగే, పాఠశాలల్లో పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించే ఆర్బీఎస్కే సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొనడంతో ఆ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.
ప్రధాన డిమాండ్లు ఇవే..
● సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి ఉద్యోగికి క్యాడర్ ఫిక్సేషన్ అమలు చేసి 100శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలి.
● ఇతర సేవల ఏజెన్సీలను రద్దు చేసి, ఎన్హెచ్ఎం ఉద్యోగులందరినీ స్టేట్ హెల్త్ సొసైటీ (ఎస్హెచ్ఎస్) పరిధిలోకి తెచ్చి స్పర్శ్ ద్వారా నేరుగా వేతనాలు ఇవ్వాలి.
● 2002 నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు 5శాతం ఇంక్రిమెంట్, 8శాతం లాయల్టీ బోనస్ మంజూరు చేయాలి.
● మహిళా సిబ్బందికి కేడర్తో సంబంధం లేకుండా 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి.
● ఉద్యోగి మృతి చెందితే కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా లేదా బీమాతో పాటు కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి ఉద్యోగం కల్పించాలి.
● ప్రతి ఉద్యోగికి ఉద్యోగ భద్రతతో పాటు ఈహెచ్ఎస్ లేదా ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి.
● పెండింగ్లో ఉన్న 9 నెలల పీఆర్సీ బకాయిలను (ఏరియర్స్) తక్షణమే విడుదల చేయాలి.
ఫ సమ్మెలో పాల్గొన్న 362 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది
ఫ సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం కలెక్టరేట్ వద్ద ఆందోళన
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఎన్హెచ్ఎం సి బ్బందిని రెగ్యులరైజ్ చే యాలి. రాష్ట్ర ప్రభుత్వాలు రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.కోవిడ్ సమయంలో ఎంతో శ్రమించి పనిచేశాం. తక్కువ వేతనాలతో కుటుంబ పోషణ భారంగా మారుతోంది. – డాక్టర్ ప్రశాంత్
వైద్య ఆరోగ్యశాఖలో ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్న ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. చాలా సంవత్సరాల నుంచి తక్కువ వేతనంతోనే పనిచేస్తున్నాం. తప్పని సరి పరిస్థితుల్లో సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. – డాక్టర్ షాహిద్


