దేవరకొండ : నిద్రిస్తున్న వ్యక్తి పైనుండి డీసీఎం వెళ్లడంతో మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం దేవరకొండ పట్టణంలో జరిగింది. ఎస్‌ఐ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండల పరిధిలోని బుడ్డతండాకు మూడావత్ రమేష్(35) హమాలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఎండ వేడిమికి తాళలేక దేవరకొండ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓ చెట్టుకింద నిద్రించాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ డీసీఎం వాహన డ్రైవర్ నిద్రిస్తున్న రమేష్‌ను గమనించకుండా అతని పైనుంచి వాహనాన్ని పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో రమేష్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.
భర్తతో గొడవ పడి మహిళ ఆత్మహత్య
భువనగిరిటౌన్ : భర్తతో గొడవ పడి క్షణికావేశంలో మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భువనగిరి పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం నాయుడువలస గ్రామానికి చెందిన లాథిపాత్రుని లక్ష్మీనాయుడు, లలిత(30) దంపతులకు 2018లో వివాహమైంది. జీవనోపాధి నిమిత్తం వారు ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చారు. 2025లో భువనగిరి శివారులోని ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీలో లక్ష్మీనాయుడుకు ఉద్యోగం రావడంతో భువనగిరి పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో స్థిరపడ్డారు. వీరికి ఆరేళ్ల కుమారుడు అయినేంద్ర నాయుడు, ఒకటిన్నర ఏళ్ల కుమార్తె జోషిత ఉన్నారు. సోమవారం రాత్రి భోజనం చేసే సమయంలో భర్తతో లలిత గొడవపడింది. దీంతో మనస్తాపానికి గురైన లలిత భర్త పిలుస్తున్నా వినకుండా బెడ్‌రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది. కాసేపటి తర్వాత లక్ష్మీనాయుడు తలుపు తట్టగా లలిత స్పందించకపోవడంతో కిటికీలోంచి చూడగా.. ఆమె కబోర్డు హ్యాంగర్‌కు ఉరి వేసుకుని కనిపించింది. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ ఎస్‌ఐ నరేష్ తెలిపారు.
2025 ‘ఎస్‌ఎస్‌సీ’
రెమ్యూనరేషన్ చెల్లించాలి
నల్లగొండ : 2025 ఎస్‌ఎస్‌సీ స్పాట్ మూల్యాంకన రెమ్యునరేషన్ చెల్లించాలని మంగళవారం నల్లగొండలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షల మూల్యాంకన కేంద్రంలో టీటీజేఏసీ, యుఎస్‌పీఎస్, జేఏసీటీఓ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గతేడాది మార్చిలో నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ స్పాట్ మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు పారితోషికం ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. కుల గణనలో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు పారితోషికం చెల్లించాలని పలుమార్లు విన్నవించినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించకపోవడం వల్ల ఉపాధ్యాయులు నిరాశగా ఉన్నారన్నారు. 10వ తరగతి మూల్యాంకన విధులకు చెల్లించే పారితోషికం గత 7 సంవత్సరాలుగా పెంచలేదని, ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ చేసే వారికి ఇప్పటికే రెండుసార్లు పారితోషికం పెంచారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు కాలం నారాయణరెడ్డి, మేకల జాన్‌రెడ్డి, సత్తయ్య, పెరుమాళ్ల వెంకటేశం, ఎడ్ల సైదులు, నర్రా శేఖర్ రెడ్డి, అరుణ, గేర నరసింహ, నలపరాజు వెంకన్న పద్మ, మమత, శ్యాం, రవీందర్, వెంకటేశ్వర్లు, వెంకులు ఏడుకొండలు, భానుప్రకాష్ పాల్గొన్నారు.


