గుర్రంపోడు : కరెంట్ స్తంభాలు తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో స్తంభాలు మీద పడి ఇద్దరు కూలీలు మృతిచెందారు. ఈ ఘటన గుర్రంపోడు మండలం ముల్కలపల్లి గ్రామ శివారులో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి గ్రామానికి చెందిన విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద ముల్కలపల్లి గ్రామానికి చెందిన ఈదుల సత్యనారాయణ(45), బొంత సైదులు(43) కొంతకాలంగా కరెంట్ స్తంభాలు పాతి లైన్లు లాగే కూలీలుగా పనిచేస్తున్నారు. వారిద్దరు మంగళవారం మధ్యాహ్నం పోచంపల్లి సబ్‌స్టేషన్ నుంచి కాల్వపల్లికి ట్రాక్టర్‌లో విద్యుత్ స్తంభాలు తీసుకెళ్తుండగా.. ముల్కలపల్లి శివారులోకి రాగానే స్తంభాలు ఒకవైపునకు జరుగుతున్నాయని కేకలు వేశారు. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ట్రాలీ బోల్తా పడింది. సత్యనారాయణ, సైదులు మీద విద్యుత్ స్తంభాల పడడంతో వారిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలాన్ని దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, మల్లేపల్లి సీఐ నవీన్‌కుమార్, ఎస్‌ఐ వెంకన్న పరిశీలించారు. మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులిద్దరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె చొప్పున ఉన్నారు.
అనుభవలేమి కారణం..?
కరెంట్ స్తంభాల లోడుతో ట్రాక్టర్‌ను నడిపిన అనుభవం డ్రైవర్‌కు లేకపోవడమే ప్రమాదానికి కారణంగా గ్రామస్తులు భావిస్తున్నారు. కాంట్రాక్టర్ వద్ద రెగ్యులర్ డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తి రెండు రోజులుగా రాకపోవడంతో మృతుల్లో ఒకరి బంధువు డ్రైవర్‌గా వచ్చాడు. ముల్కలపల్లి వద్ద స్పీడ్ బ్రేకర్ ఉండటంతో స్తంభాలు ట్రాక్టర్‌లో నుంచి జారిపోతుండటంతో మృతులు కేకలు వేయగా.. డ్రైవర్ వెనుక చూసేలోపు అదుపుతప్పి బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది.


