మునుగోడు : కొన్నేళ్లుగా మునుగోడు మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేసి పంటలు సాగు చేసుకుంటుండగా.. ఆ భూమిని మంగళవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మునుగోడులోని సర్వే నంబర్ 78లో దాదాపు 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. అందులో ప్రభుత్వం కొందరికి పట్టాలు ఇవ్వగా ఆ రైతులు పంటలను సాగు చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు మరికొందరు ఎలాంటి పట్టాలు లేకుండా భూమిని కబ్జా చేశారు. ఇటీవల ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు భూమి అవసరం కాగా.. దాదాపు 2 నెలలపాటు సర్వే చేసి కబ్జా భూమిని గుర్తించారు. ముందుగా పాఠశాలకు 20 ఎకరాల భూమిని ఒకేచోట కేటాయించారు. ఆ స్థలంలో పట్టాలు కలిగిన ఆరుగురు రైతులు తమ భూమిని పాఠశాలకు ఇచ్చారు. వారందరికీ తిరిగి భూమి ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. పట్టాలు లేకుండా భూమి కబ్జా చేసిన వారి నుంచి 7 ఎకరాల 20 గుంటల భూమిని చండూరు ఆర్డీఓ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తుతో స్వాధీనం చేసుకుని వెంటనే పాఠశాలకు భూమి ఇచ్చిన రైతులకు అప్పగించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్. నరేష్, చండూరు సీఐ ఆదిరెడ్డి, ఎస్‌ఐ రవి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


