బైక్‌ అదుపుతప్పి మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ అదుపుతప్పి మృతి

Oct 15 2025 6:20 AM | Updated on Oct 15 2025 6:20 AM

బైక్‌

బైక్‌ అదుపుతప్పి మృతి

అడ్డగూడూరు: బైక్‌పై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన అడ్డగూడూరు మండలం చిర్రగూడూరు గ్రామ శివారులో సోమవారం రాత్రి జరిగింది. మంగళవారం ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన కుంభం రాజు(29) హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం తన బావమరిది పెళ్లి ఉండటంతో స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం బైక్‌పై యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి గ్రామంలో తన స్నేహితుడి అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి సాయంత్రం స్వగ్రామానికి వెళ్తుండగా.. అడ్డగూడూరు మండలం చిర్రగూడూరు గ్రామ శివారులోని ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోలబంక్‌ సమీపంలోకి రాగానే బైక్‌ అదుపుతప్పడంతో కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

వరి ధాన్యం దొంగిలిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

కేతేపల్లి: రైతులు రోడ్డు వెంట ఆరబోసిన వరి ధాన్యాన్ని అపహరించిన ఇద్దరు దొంగలను మంగళవారం కేతేపల్లి పోలీసులు పట్టుకుని రిమాండ్‌ చేశారు. ఎస్‌ఐ సతీష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్‌(ఎస్‌) మండలం గట్టికల్లు గ్రామానికి చెందిన ఆటో డైవర్‌ బచ్చలకూరి మహేష్‌, పెయింటర్‌గా పనిచేస్తున్న గుర్రాల రమేష్‌ ముఠాగా ఏర్పడి పలు ప్రాంతాల్లో వరి ధాన్యాన్ని దొంగిలించి విక్రయించగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. ఈ క్రమంలో కేతేపల్లి మండలంలోని చీకటిగూడెం, ఉప్పలపహాడ్‌ గ్రామాల్లో రోడ్డు వెంట రైతులు ఆరబోసిన వానాకాలం వరి ధాన్యాన్ని గత కొన్నిరోజుల నుంచి చోరీ చేస్తూ మహేష్‌కి చెందిన ఆటోలో తరలించి అమ్ముకుంటున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కేతేపల్లి పోలీసులు రాత్రి వేళ రోడ్లపై నిఘా పెంచారు. మంగళవారం ఎస్‌ఐ సతీష్‌ తన సిబ్బందితో కలసి చీకటిగూడెం శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా రమేష్‌, మహేష్‌ ఆటోలో వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వరి ధాన్యం దొంగతనం చేస్తున్నట్లు నిజం ఒప్పుకున్నారు. నిందితులను నకిరేకల్‌ కోర్టులో రిమాండ్‌ చేశామని ఎస్‌ఐ తెలిపారు.

నాలుగు గేట్ల ద్వారా

మూసీ నీటి విడుదల

కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 8,598 క్యూసెక్కుల వరద వస్తుండగా.. ప్రాజెక్టు అధికారులు నాలుగు క్రస్ట్‌ గేట్లను రెండు అడుగుల మేర పైకెత్తి 8,579 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ కాల్వలకు 340 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం 644 అడుగుల వద్ద నీటిమట్టం నిలకడగా ఉంచి ఎగువ నుంచి వచ్చే వరదను దిగువకు విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట అధికారులు పేర్కొన్నారు. 4.46 టీఎంసీ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం గల మూసీ ప్రాజెక్టులో ప్రస్తుతం 4.27 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది.

బైక్‌ అదుపుతప్పి మృతి
1
1/1

బైక్‌ అదుపుతప్పి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement