
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండల పరిధిలోని ఖాసీంపేట గ్రామ శివారులో అనుమానాస్పద ిస్థితిలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామానికి చెందిన మేడబోయిన శివశంకర్(31) సూర్యాపేటలోని సుధాకర్ పీవీసీ కంపెనీలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 11న ఇంట్లోంచి బయటకు వెళ్లిన శివ తిరిగి ఇంటికి చేరుకోలేదు. తల్లిదండ్రులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో చివ్వెంల మండల పరిధిలోని ఖాసీంపేట గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాలువ పక్కన కుళ్లిపోయి ఉన్న మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ కనకరత్నం తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు సహాయంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి యల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ హాస్పిటల్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు అవివాహితుడు.