
బౌద్ధం.. జీవన విధానాన్ని తెలిపే మార్గం
నాగార్జునసాగర్: బౌద్ధం ఒక మతం కాదని.. అది జీవన విధానం తెలిపే దమ్మ మార్గమని మహారాష్ట్రలోని సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మహేష్ దియోకర్ అన్నారు. మంగళవారం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో ధమ్మ విజయ వేడుకలను బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రొఫెసర్ మహేష్ దియోకర్ హాజరై బుద్ధవనంలోని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతర మహాస్థూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్ఞాన జ్యోతిని వెలిగించారు. అనంతరం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బుద్ధుని ధమ్మ చక్ర ప్రవర్తన సారాంశాన్ని విస్తరిస్తూ అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించిన రోజును ధమ్మ విజయంగా చెప్పబడుతందన్నారు. ఇదే రోజున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించారని తెలిపారు. బౌద్ధ దమ్మంతో సహోదరతత్వం విరాజిల్లిందన్నారు. ఆనాడు పాలీ భాషలో అనేక ధర్మశాసనాలను ప్రపంచ నలుమూలలకు అశోక చక్రవర్తి విస్తరింపజేసి ప్రపంచమంతటా బుద్ధ ధమ్మ సారాంశాన్ని వ్యాప్తి చేశారని పేర్కొన్నారు. సమాజంలో అసమానతలను రూపుమాపి సమానత్వాన్ని కల్గించడం కోసం బుద్ధ దమ్మమే మార్గమని బీఆర్ అంబేడ్కర్ చాటాడని తెలిపారు. ఇలాంటి మహాత్ములు స్వీకరించిన సద్ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. వీటన్నింటికి బుద్ధవనం కేంద్రంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. బుద్ధవనంలో బుద్ధుని బోధనలు తెలియజేసేలా ఒక విద్యా కేంద్రం ఏర్పాటు చేయాలని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్యకు ఆయన సూచించారు. అనంతరం మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. బుద్ధవనం తెలంగాణకు లాండ్‌మార్క్‌గా నిలుస్తుందన్నారు. ప్రశాంతతకు, ధమ్మానికి, జ్ఞానానికి ప్రేరణకు మారుపేరుగా బుద్ధవనం నిలుస్తుందని పేర్కొన్నారు. ఎంజీయూలో బుద్ధిష్ట్ స్టడీస్‌లో సర్టిఫికేషన్ కోర్సు అందించేలా కృషిచేస్తామన్నారు. రాబోయే 15 ఏళ్లో బుద్ధవనం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాలని ఆకాక్షించారు. బుద్ధవనంలో విద్యా కేంద్రానికి తన వంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం హైదరాబాద్ రెడ్డి మహిళా కళాశాల కార్యదర్శి ముత్యంరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారంతో బుద్ధవనంలో బౌద్ధ అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ భవిష్యత్తుకు యువతే ప్రధానమని, బౌద్ధ ధమ్మ ఆవశ్యకతను యువత తెలుసుకోవాలన్నారు. అనంతరం బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. బుద్ధఽ దమ్మం తెలంగాణలో ఎలా ప్రవేశించిందో వివరించారు. బుద్ధవనాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి జరుగుతుందని, ఇప్పటికే డిజిటల్ మ్యూజియం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీగురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాధవీలత, బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, నల్ల గొండ జిల్లా టూరిజం అధికారి శివాజీ, బుద్ధవనం ఆర్ట్స్ ప్రమోషన్స్ మేనేజర్ శ్యామసుందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
పూణే విశ్వవిద్యాలయం
ప్రొఫెసర్ మహేష్ దియోకర్
బుద్ధవనంలో ఘనంగా
ధమ్మ విజయ వేడుకలు

బౌద్ధం.. జీవన విధానాన్ని తెలిపే మార్గం