
హోరాహోరీగా ఉమ్మడి జిల్లా ఎస్‌జీఎఫ్ పోటీలు
భువనగిరి: భువనగిరి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మైదానంలో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) వాలీబాల్ పోటీలు(అండర్–17 బాలబాలికలు)ను యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ పోటీల్లో బాలుర విభాగంలో యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి స్థానంలో, నల్లగొండ జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో సూర్యాపేట జిల్లా, ద్వితీయ స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా జట్లు నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి దశరథరెడ్డి, టీజీపీఈటీఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏ. మల్లేశం, టి. చంద్రశేఖర్, రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి నాతి కృష్ణమూర్తి, జిల్లా పీఆర్‌టీయూ కార్యదర్శి మధుసూదన్, వెంకట్‌రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
హుజూర్‌నగర్‌లో కబడ్డీ పోటీలు..
హుజూర్‌నగర్: హుజూర్‌నగర్‌లోని క్యాంప్ హైస్కూల్‌లో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ కబడ్డీ పోటీలను(అండర్–14, 17 బాలబాలికలు) సీఐ చరమంద రాజు, ఎస్‌జీఎఫ్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి ఎం. కిరణ్‌కుమార్ ప్రారంభించారు. ఈ పోటీల్లో అండర్–17 బాలుర విభాగంలో ప్రథమ బహుమతి నల్లగొండ జిల్లా, ద్వితీయ బహుమతి సూర్యాపేట జిల్లా, బాలికల విభాగంలో ప్రథమ బహుమతి నల్లగొండ జిల్లా, ద్వితీయ బహుమతి సూర్యాపేట జిల్లా జట్లు గెలుపొందాయి. అండర్–14 బాలుర విభాగంలో ప్రథమ బహుమతి నల్లగొండ జిల్లా, ద్వితీయ బహుమతి సూర్యాపేట జిల్లా, బాలికల విభాగంలో ప్రథమ బహుమతి నల్లగొండ జిల్లా, ద్వితీయ బహుమతి సూర్యాపేట జిల్లా జట్లు గెలుపొందినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. అండర్– 14 బాలబాలికల జిల్లా జట్లు ఈ నెల 16 నుంచి 18 వరకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. అదేవిధంగా అండర్–17 బాలబాలికల జట్లకు రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడా పోటీల తేదీలు ప్రకటించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సైదానాయక్, ఇన్‌చార్జి హెచ్‌ఎం జాని, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు దొంతగాని శ్రీనివాస్ గౌడ్, కోతి సంపత్‌రెడ్డి, క్రీడాకారులు సుధాకర్‌రెడ్డి, పోతురాజు రమేష్, వెంకటరత్నం, నియోజకవర్గ ఎస్‌జీఎఫ్ ఇన్‌చార్జి దేవిశెట్టి రవి, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.

హోరాహోరీగా ఉమ్మడి జిల్లా ఎస్‌జీఎఫ్ పోటీలు