
రైలు నుంచి పడి తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు మృతి
గరిడేపల్లి: మండల పరిధిలోని కీతవారిగూడెం గ్రామానికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కీత వెంకటేశ్వర్లు బుధవారం వ్యక్తిగత పనులపై ఢిల్లీ వెళ్తుండగా మార్గమధ్యలో జార్ఖండ్ రాష్ట్రంలోని కడారు ప్రాంతంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి మృతి చెందారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఈ ప్రాంతం నుంచి చురుకై న పాత్ర పోషించారు. వెంకటేశ్వర్లు మృతి పట్ల మండల బీఆర్‌ఎస్ నాయకులు సంతాపం తెలిపారు.
గుర్తుతెలియని వాహనం
ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు
మునగాల: మండలంలోని ఆకుపాముల శివారులో జాతీయ రహదారిపై బుధవారం గుర్తు తెలియని కారు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కోదండరామాపురం గ్రామానికి చెందిన రెణబోతు అప్పిరెడ్డి, రెణబోతు లక్ష్మీనరసింహారెడ్డి ఇద్దరు సోదరులు. లక్ష్మీనరసింహారెడ్డికి చెందిన ద్విచక్రవాహనంపై అప్పిరెడ్డితో కలిసి కోదాడ మండలం కందిబండ గణపవరం గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. మార్గమధ్యంలో ఆకుపాముల వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే కారు అతివేగంగా వచ్చి వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. గాయపడిన వీరిద్దరిని స్థానికులు చికిత్స నిమిత్తం కోదాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వారి కుటుంబసభ్యులు కోదాడకు చేరుకొని మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మంకు తరలించారు. ఈ విషయమై స్థానిక ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.