
జల హొయలు
మర్రిగూడ: 2500 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ ఉన్న కొండలు, వాటి మధ్య పరుచుకున్న పచ్చదనం ప్రకృతి ప్రేమికులను ఎంతో మైమరపింపజేస్తోంది. అక్కడే కొలువుదీరిన బుగ్గ శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక చింతన పెంపొందిస్తోంది. ఎత్తిపోతల పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. మర్రిగూడ మండల పరిధిలోని అజ్జలాపురం బుగ్గ వద్ద జలపాతం వర్షాకాలం మొదలుకుని ఆరు నెలల పాటు పర్యాటకులను కనువిందు చేస్తుంది.
ప్రకృతి అందాలకు దాసోహం
మర్రిగూడ మండల కేంద్రం నుంచి 10కిలోమీటర్ల దూరంలో ఈ బుగ్గ ఉంది. ఈ ప్రాంతమంతా కొండలు, లోయలు, పచ్చనిచెట్లతో కూడుకుని ఉంటుంది. వరద నీరంతా ఒకేచోట చేరి కొండపై నుంచి కిందకు దూకుతూ జలపాతాన్ని తలపిస్తుంటుంది. గత ఐదు రోజులుగా నీటి ప్రవాహం వస్తుండడంతో యువకులు, పరిసర ప్రాంతాల ప్రజలు ఇక్కడకు చేరుకుని సందడి చేస్తుంటారు.
గుహ మధ్యలో వెలసిన శివలింగం
మర్రిగూడ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా నిత్యం వందల సంఖ్యలో జలపాతం వస్తున్న సమయంలో వచ్చి వెళ్తుంటారు. యువత ఇక్కడ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకుంటారు. ఈ జలపాతం దగ్గరకు వెళ్లాలంటే అజ్జలాపురం గ్రామం నుంచి సుమారు 2కి.మీ మేరకు కాలినడక ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాలినడకన వెళ్లే మార్గంలో వివిధ పక్షుల రాగాలు కాలినడక అలసటను మైమరపింపజేస్తాయి. ఈ ప్రాంతంలో కొలువైన శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ కొండల నడుమ గుహ మధ్యలో శివలింగం కూడా వెలిసింది. ఈ ప్రాంతానికి వచ్చివారు స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ పెద్దఎత్తున మొగలి చెట్లు ఉండడంతో ఈ ప్రాంతమంతా మొగలి పూల సువాసన వెదజల్లుతుంది.
ఫ కనువిందు చేస్తున్న అజ్జలాపురం
బుగ్గ జలపాతం
ఫ అటవీ ప్రాంతమంతా
మొగలి పూల సువాసన