
బైక్‌ల చోరీ ముఠా అరెస్ట్
భువనగిరిటౌన్ : బైక్‌ల చోరీ ముఠాను భువనగిరి పట్టణ పోలీసులు పట్టుకున్నారు. కేసు వివరాలను బుధవారం భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పట్టణ ఇన్‌స్పెక్టర్ రమేష్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని యాకుత్‌పుర చెందిన సయ్యద్ తలీబ్ అలియాస్ సమీక్(ఏ1) అలూబా(ఎ2), రేహన్ (ఏ3), ఎండీ సాజిద్(ఏ4)తోపాటు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం గోమల్ గ్రామానికి చెందిన మహ్మద్ షోయబ్ అలియాస్ శ్రీనివాస్(ఏ5) ముఠాగా ఏర్పడ్డారు. ప్రధాన నిందితుడు సయ్యద్ తలీబ్ గతంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి ఆగస్టులో బెయిల్‌పై విడుదలయ్యాడు. అతడికి పరిచయమున్న అలూబా, రేహన్, సాజిద్‌తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఈ నలుగురు కలిసి ఇళ్ల ఎదుట పార్కింగ్ చేసి ఉన్న బైక్‌లను చోరీ చేసి వికారాబాద్ జిల్లాకు చెందిన షోయబ్‌కు ఇచ్చేవారు. అతడు తనకు తెలిసిన వాళ్లకు విక్రయించేవాడు. ఇలా వచ్చిన డబ్బును ఐదుగురు కలిసి సమాన వాటాగా పంచుకునేవారు. ఈనెల 6వ తేదీన భువనగిరిలో జరిగిన ద్విచక్రవాహనం చోరీ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను సీసీ కెమెరాలో గుర్తించారు. ఈమేరకు హైదరాబాద్‌లో సయ్యద్ తలీబ్, సాజిద్, మహ్మద్ షోయబ్‌ను అరెస్ట్ చేసి భువనగిరి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మిగతా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు ఇన్‌స్పెక్టర్ చెప్పారు. పట్టుబడ్డ నిందితుల వద్ద రూ.4.80లక్షల విలువైన ఐదు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్సైలు రమేష్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.