
చీఫ్ జస్టిస్‌పై దాడి.. ప్రజాస్వామ్యం పైనే దాడి
నల్లగొండ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ మీద జరిగిన దాడి.. దేశ ప్రజాస్వామ్య విలువలపై దాడి అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తీవ్రంగా ఖండించారు. జస్టిస్ గవాయ్‌పై జరిగిన దాడికి నిరసనగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా చేశారు. ఈ ధర్నాలో మంద కృష్ణమాదిగ పాల్గొని మాట్లాడుతూ.. దళితుడైన చీఫ్ జస్టిస్‌పై జరిగిన దాడి ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగాన్ని అవమానించే ప్రయత్నమని అన్నారు. ఈ దాడి వెనుక ఉన్న ఆధిపత్య శక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామిక దృక్పథం కలిగిన సీనియర్, రిటైర్డు న్యాయమూర్తులతో స్వతంత్ర విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని శక్తులు దళితుల ఎదుగుదలను చూసి ఓర్వలేక దాడులకు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు. దేశ ప్రజలంతా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్‌ను కలిసి మంద కృష్ణమాదిగ వినతి పత్రం అందజేశారు. ధర్నాలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద నరేష్, మహాజన సోషలిస్టు పార్టీ నాయకులు జానకిరామయ్య, మాదిగ ఉద్యోగుల సంఘం జాతీయ నాయకుడు దైద సత్యంమాదిగ, ఎంజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గాదె రమేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
దాడి వెనుక ఉన్న శక్తులను
గుర్తించి కఠినంగా శిక్షించాలి
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా