
ఓపీ కోసం టోకెన్ విధానం తేవాలి
బీబీనగర్: రోగులు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడకుండా టోకెన్ సిస్టం తీసుకురావాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎయిమ్స్ అధికారులకు సూచించారు. సోమవారం బీబీనగర్ ఎయిమ్స్‌ను ఆయన సందర్శించారు. ఓపీ విభాగం వద్ద క్యూలైన్లలో నిల్చున్న రోగులతో మాట్లాడగా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గంటల తరబడి లైన్‌లో నిలబడవలసి వస్తుందని మొరపెట్టుకున్నారు. దత్తాత్రేయ స్పందించి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారి దర్శనం కోసం భక్తులకు టోకెన్లు జారీ చేస్తున్న విధంగా ఎయిమ్స్‌కు వచ్చే రోగులకు ఆ తరహా విధానం అమల్లోకి తీసుకువస్తే బాగుంటుందన్నారు. టోకెన్ ఇవ్వడం వల్ల రోగులు ముందే వచ్చి గంటల తరబడి వేచివుండే పనిలేకుండా సమయానుకూలంగా క్యూలెన్‌కు వెళ్తారని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఎయిమ్స్‌కు ఎలక్ట్రిక్ బస్సుల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థల ద్వారా కృషి చేస్తానన్నారు. అంతకుముందు ఎయిమ్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ శాంతాసింగ్‌తో సమావేశమై ఎయిమ్స్‌లో జరుగుతున్న పనులు, వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. ఫైర్‌స్టేషన్, ఉప్పల్‌నుంచి ప్రత్యేక బస్సుల సౌకర్యం కల్పించేలా చూడాలని దత్తాత్రేయకు వైద్యులు విన్నవించారు. అనంతరం ఎంబీబీఎస్ వి ద్యార్థులతో సమావేశం అయ్యారు. అంకితభావంతో పనిచేయాలని, రోగుల పట్ల బాధ్యతాయుతంగా మెలగాలని.. అప్పుడే జాతీయస్థాయిలో బెస్ట్ వైద్య కళాశాలగా బీబీనగర్ ఎయిమ్స్ నిలుస్తుందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అవసరం
పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారం ఎంతో అవసరమని దత్తాత్రేయ అన్నారు. ఎయిమ్స్‌లో వైద్య సేవలు పొందే రోగుల సంఖ్య వేలల్లో పెరుగుతున్నందున సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎయిమ్స్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకొని.. ఇక్కడ కావాల్సిన ఫైర్ స్టేషన్, బస్సుడిపో సౌకర్యం కల్పించాల్సిన అ వసరం ఉందన్నారు. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి 2009లో నిమ్స్‌కు భీజం వేయడంతో ఇప్పుడు ఎయిమ్స్‌గా మారిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి మాత్రమే ఎయిమ్స్ మంజూరైందని, కానీ ప్రధాని మోదీ తెలంగాణకు కూడా ఎయిమ్స్‌ను బహుమతిగా ఇచ్చారని అన్నారు. ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ సేవలు, పెండింగ్‌లో ఉన్న ఇతర విషయాలు, కావాల్సిన సౌకర్యాల విషయాలను ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎయిమ్స్ డీన్ నితిన్‌అశోక్‌జాన్, డిప్యూటీ డైరెక్టర్ బిపిన్ వర్గీస్, మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ మహేశ్వర్‌రెడ్డి, ఓఎస్‌డీ ప్రశాంత్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ విశాక్‌జైన్, గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు.
ఫ హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
ఫ ఎయిమ్స్ వరకు ఎలక్ట్రిక్ బస్సులు
ఏర్పాటు చేయిస్తా