
పంటల్లో తెగుళ్ల నివారణపై అవగాహన
మేళ్లచెరువు: పత్తి, వరి, మిరప పంటల్లో వచ్చే తెగుళ్లపై మంగళవారం చింతలపాలెం మండలంలో రైతులకు గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త సీహెచ్. నరేష్ మాట్లాడుతూ.. ఇటీవల వర్షాలు ఎక్కువగా కురవడంతో నేలలో తేమ శాతం ఎక్కువగా ఉంటుందని, ఈ సమయంలో పత్తి పంటలో ఎరువులు వేసుకోవడం అనుకూలంగా ఉందన్నారు. తేమ ఎక్కువగా ఉండడంతో రసం పీల్చే పురుగు పచ్చదోమ, తెల్లదోమ కనిపించిన వెంటనే అసిటమిప్రైడ్ 0.2గ్రాములు లీటరు నీటికి లేదా వేపనూనె 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. అదేవిధంగా పసుపు రంగు జిగురు అట్టలు వాడుకోవాలని సూచించారు. అదేవిధంగా వేరుకుళ్లు, మొదళ్లు కుళ్లు వంటివి రావడానికి ఆస్కారం ఉందన్నారు. కావున రైతులు హెక్సాకాన్‌జోల్ 1మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. మిరప పంటలో వచ్చే తెగుళ్లకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కిరణ్, వ్యవసాయ విస్తరణ అధికారి భవాని, వ్యవసాయ కళాశాల విద్యార్థులు పద్మావతి, సుష్మిత, శరణ్య తదితరులు పాల్గొన్నారు.