
చింపాంజీ మాస్క్.. కోతులు షాక్
రాజాపేట: రాజాపేట మండలం మల్లగూడెం గ్రామ పంచాయతీలో కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు గ్రామ పంచాయతీ సిబ్బందికి చింపాంజీ మాస్క్ వేయించి వాటిని భయపెట్టే ఉపాయం చేశాడు ఆ ఊరి గ్రామ పంచాయతీ కార్యదర్శి. వివరాలు.. మల్లగూడెం గ్రామం పక్కనే అడవి ఉండడంతో కోతులు గ్రామంలోకి వచ్చి ప్రజలపై దాడి చేస్తున్నాయి. రైతులు వేసిన ఏ పంట వేసినా నాశనం చేస్తున్నాయి. గ్రామ శివారులో పాఠశాల ఉండడంతో మధ్యాహ్నం భోజనం సమయంలో విద్యార్థులపై దాడికి దిగేవి. ఈ పరిస్థితిని గమనించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి చక్రిధర్ వినూత్న ఆలోచన చేశాడు. ఆన్‌లైన్‌లో చింపాంజీ మాస్కును రూ.1500కు కొనుగోలు చేశాడు. గ్రామ పంచాయతీ సిబ్బందికి చింపాంజీ మాస్కు వేయించి కోతులు వచ్చిన సమయంలో వాటిని వెంబడిస్తూ పరిగెత్తించాడు. ఇలా గత నెల రోజుల్లో రెండు మూడు సార్లు గ్రామంలోకి వచ్చిన కోతులను చింపాంజీ వేషధారణతో భయపెట్టసాగారు. దీంతో ప్రస్తుతం గ్రామంలోకి కోతులు రావాలంటేనే జంకుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా కోతుల బెడదతో ఇబ్బంది పడ్డ గ్రామస్తులు, రైతులు గ్రామ పంచాయతీ కార్యదర్శి చక్రిధర్ చేసిన ఆలోచనకు కోతుల బెడదకు చెక్ పెట్టినట్లు అయ్యిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఫ వానరాల బెడదను అరికట్టేందుకు
పంచాయతీ కార్యదర్శి వినూత్న ఆలోచన