
కారును ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
● ముగ్గురికి గాయాలు
చిట్యాల: రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల మధ్య నలిగిపోయి కారు నుజ్జునుజ్జవ్వగా.. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చిట్యాల పట్టణ శివారులో ఆదివారం తెల్ల వారుజామున జరిగింది. స్థానిక ఎస్‌ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు చిట్యాల పట్టణ శివారులోని ఇండియన్ ప్రెటోల్ బంకు వద్దకు చేరుకోగానే హైవేపై ట్రాఫిక్ జాం కావడంతో డ్రైవర్ బస్సును రహదారి పైనే నిలిపివేశాడు. బస్సు వెనుకే వస్తున్న కారు సైతం ఆగిపోయింది. అదే సమయంలో కారు వెనుక నుంచి కేవీఆర్ ట్రావెల్స్ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు రెండు ట్రావెల్స్ బస్సుల మధ్యలో నలిగిపోయి నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏపీలోని కృష్ణా జిల్లా మచిలిపట్నంకు చెందిన గొర్రె జోష్‌కుమార్, చల్ల శ్రీహర్షకు తీవ్రగాయాలవ్వగా.. మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అతివేగంగా బస్సు నడిపి ప్రమాదానికి కారణమైన కేవీఆర్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ జోవన్నపూడి విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.