
డయల్ 112
ఫోన్ చేయలేని పరిస్థితుల్లో..
సెల్‌ఫోన్ పవర్ బటన్ నొక్కాలి
ఇకపై కొత్త నంబర్‌కే కాల్ చేయాలి
అత్యవసర సహాయానికి ఒక్కటే నంబర్
ఆలేరు: ఒకే దేశం, ఒకే అత్యవసర నంబర్ నినాదంతో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన డయల్ 112పై హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ), పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఆదేశాల మేరకు ఆలేరు, భువనగిరి, యాదగిరిగుట్ట్ట, రాజాపేట, గుండాల, బీబీనగర్ మండలాల పరిధిలోని పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు 112 నంబర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నంబర్‌తోపాటు సైబర్‌నేరాలు, బాల్యవివాహాల నిర్మూలన, రోడ్డు ప్రమాదాలు, మహిళలు, పిల్లల భద్రత, హ్యుమన్ ట్రాఫికింగ్, మత్తుపదార్థాల రవాణా నిరోధం, కొత్త చట్టాలపైనా ప్రచారం చేస్తున్నారు. అత్యవసర సహాయ సేవల పర్యవేక్షణకు ప్రభుత్వ ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది.
గతంలో వేర్వేరు సేవలకు విభిన్న నంబర్లు
పోలీసుల సహాయ కోసం 100, బాలల రక్షణకు 1098, వైద్య సహాయానికి అంబులెన్స్ కావాలంటే 108, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు 101.. ఇలా వేర్వేరు అత్యవసర సేవలకు విభిన్నమైన నంబర్లు ఉండేవి. ఇకపై ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా కేవలం 112కు ఫోన్ చేస్తే సరిపోతుంది. ఈ వ్యవస్థ ప్రజలకు సహాయాన్ని చేరువ చేయడమే కాకుండా వేగవంతమైన రెస్పాన్స్ అందిస్తుంది.
నూతన వ్యవస్థలో జీపీఎస్ కీలకపాత్ర
నూతన వ్యవస్థల్లో జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) కీలకపాత్ర పోషిస్తుంది. ఎవరైనా 112కు ఫోన్ చేసిన వెంటనే, వారి కచ్చితమైన స్థానాన్ని గుర్తించి, సమీపంలో అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలను వెంటనే సంఘటన స్థలానికి పంపేలా ఈ వ్యవస్థను రూపొందించారు. సహాయం అందే వరకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని బాధితులకు అప్‌డేట్ చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో అధికారులను కమాండ్ కంట్రోల్ రూం మానిటరింగ్ చేస్తుంది. సంఘటనా స్థలానికి వెళ్లిన సిబ్బంది తమ ట్యాబ్ ద్వారా తిరిగి క్లియరెన్స్ సమాచారం ఇచ్చే వరకు కంట్రోల్‌రూం సిబ్బంది పర్యవేక్షణ చేస్తుంది.
ఫ జీపీఎస్ ద్వారా బాధితుల లొకేషన్ గుర్తింపు
ఫ ఏహెచ్‌టీయూ, పోలీసుల ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
112 నంబర్ 24గంటలు పని చేస్తోంది. బాధితులకు వివిధ భాషల్లో మద్ధతు లభిస్తుంది. తమ సెల్‌ఫోన్‌తోపాటు ల్యాండ్ ఫోన్ నుంచి 112కు డయల్ చేయొచ్చు. ఫోన్ చేయలేని పరిస్థితిలో ఉంటే తమ సెల్‌ఫోన్‌లో పవర్ బటన్‌ను మూడుసార్లు నొక్కితే ఆటోమేటిక్‌గా 112కు కాల్ వెళ్లి, కావాల్సిన సహాయం బాధితులకు అందుతుందని ఏహెచ్‌టీయూ సబ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ ‘సాక్షి’తో చెప్పారు.
సీపీ సుధీర్‌బాబు ఆదేశాల మేరకు ఏహెచ్‌టీయూ సిబ్బంది, స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో 112 నంబర్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రోడ్డు ప్రమాదాలు, వైద్య, పోలీసు,అగ్నిమాపక తదితర అత్యవసర సహాయం కోసం ప్రజలు ఇకపై కొత్త నంబర్‌కే ఫోన్ చేయాలి. –యాలాద్రి, ఆలేరు సీఐ

డయల్ 112

డయల్ 112