
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
ఆలేరురూరల్ : రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలూ తావుండరాదని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణకు ప్రభుత్వం రూ.25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించిందన్నారు. కొనుగోలు చేసిన వడ్లకు 12 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. సన్నరకం వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని, పాత బకాయిలతో కలిపి త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు.
గత పాలకుల తప్పిదాల వల్లే
మదర్ డెయిరీకి నష్టాలు : బీర్ల ఐలయ్య
గత పాలకుల తప్పిదాల వల్ల మదర్ డెయిరీ నష్టాల్లోకి వచ్చిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. సంస్థను లాభాల్లోకి తీసుకురావడానికి నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ వారితో చర్చలు నడుస్తున్నాయని తెలిపారు. దీపావళి నాటికి రైతులకు పాల బిల్లులు అందే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. అనంతరం కొల్లూరు, మందనపల్లిలో కొనుగోలు కేంద్రాలను బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఐనాల చైతన్య, పీఏసీఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేషం, వెంకటేశ్వరరాజు, ఆరె ప్రశాంత్, గంధమల్ల అశోక్, నీలం పద్మ, కట్టెగొమ్ముల సాగర్‌రెడ్డి, తుంగకుమార్, బుగ్గ నవీన్, గాజుల వెంకటేష్, శ్రీకాంత్, కర్రె అజయ్, ఎఫ్‌పివో నిర్వాహాకులు వస్పరి స్వామి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి