
పొంగిన వాగులు
రెండు గంటల పాటు భారీ వర్షం
ఫ అత్యధికంగా పోచంపల్లిలో 99 మి.మీ
ఫ వాగులకు పోటెత్తిన వరద
ఫ ముక్తాపూర్‌లో పాఠశాల తరగతి గదుల్లోకి వెళ్లిన నీరు
ఫ నేడు, రేపూ వర్షాలు
ఫ పలు మండలాలకు
ఎల్లో అలర్ట్ హెచ్చరికలు
భువనగిరిటౌన్ : జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు కురిసిన వర్షానికి వాగులు పొంగిపొర్లాయి. పలు చోట్ల లోలెవల్ వంతెనల పైనుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. అత్యధికంగా భూదాన్‌పోచంపల్లిలో 99.3 మి.మీ, మోటకొండూరు 63మి.మీ, చౌటప్పుల్ 49మి.మీ, భువనగిరి 47మి.మీ, బీబీనగర్ 20మి.మీ, వలిగొండ 14 మి.మీ, బొమ్మలరామారం 10 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 3.39 సెంటీ మీటర్ల వర్షం కురిసిందని, ఈ సీజన్‌లో ఇదే అధిక వర్షపాతం. రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశ ఉండటంతో పలు మండలాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
భూదాన్‌పోచంపల్లి: మండల వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. సుమారు రెండుగంటల పాటు వర్షం కురిసింది. దాంతో చిన్నేరకు వరద ఉధృతి పెరిగి మెహర్‌నగర్–జలాల్‌పురం మధ్య ఉన్న లోలెవల్‌బ్రిడ్జి పైనుంచి ప్రవహించింది. వరదనీటితో భారీగా గుర్రపుడెక్కాకు కొట్టుకొచ్చి బ్రిడ్జి పై చేరింది. ఫలితంగా రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం మెహర్‌నగర్ గ్రామస్తులు జేసీబీతో బ్రిడ్జిపైన చేరిన గుర్రపుడెక్కను తొలగించారు. పంటపొలాలకు వచ్చే కాలువకు వరద ఉధృతి పెరిగి ముక్తాపూర్ ప్రభుత్వ పాఠశాల తరగతి గదుల్లోకి నీరు చేరింది. పోచంపల్లి జెడ్పీస్కూల్ ఆవరణలో భారీగా వర్షపునీరు నిలిచి మడుగును తలపించింది. అలాగే కిచెన్ గార్డెన్‌ను వరదనీరు ముంచెత్తింది.
మోటకొండూర్: వర్షానికి మోటకొండూర్ మండల కేంద్రంలోని పెద్దవాగు, కాటేపల్లి, చాడ, కొండాపూర్ గ్రామాల పరిధిలో బిక్కేరు వాగుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో మోటకొండూర్ – సికింద్రనగర్, కాటేపల్లి–సికింద్రనగర్, చందేపల్లి–చాడ, కొండాపురం–కాల్వపల్లి గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రయాణికులు చుట్టూ తిరిగి గమ్య స్థానాలకు చేరుకున్నారు.
ఆత్మకూరు(ఎం): మండల పరిధిలో బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మొరిపిరాల, కొరటికల్, పోతిరెడ్డిపల్లి, టి. రేపాక కాజ్‌వేల పైనుంచి వరద ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.చెక్‌డ్యాంలు పూర్తిగా నిండి అలుగుపోస్తున్నాయి. ఎంపీడీఓ రాములునాయక్, సూపరింటెండెంట్ లోకేశ్వర్‌రెడ్డి, ఎంపీఓ పద్మావతి, పంచాయతీ కార్యదర్శి శేఖర్‌లు సందర్శించి ప్రజలకు సూచనలు చేశారు.

పొంగిన వాగులు

పొంగిన వాగులు

పొంగిన వాగులు

పొంగిన వాగులు