
ఆర్‌ఐ, పాలడుగు కార్యదర్శి సస్పెన్షన్
సాక్షి,యాదాద్రి : మోత్కూర్ మండలం పాలడుగు పంచాయతీ కార్యదర్శి శోభన్, ఆర్‌ఐ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హనుమంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అనర్హులకు కల్యాణలక్ష్మి చెక్కు మంజూరు చేయడంలో కారణం కావడంతో వారిని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమగ్రమైన విచారణ చేయాలని భువనగిరి ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేశారు.
దాచారం కార్యదర్శి
సస్పెన్షన్ ఎత్తివేత
మోత్కూరు : మండలంలోని దాచారం గ్రామ పంచాయతీ కార్యదర్శి బొడ్డు యాదగిరి సస్పెన్షన్ ఎత్తివేస్తూ కలెక్టర్ హనుమంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డెయిలీ శానిటేషన్ రిపోర్ట్ ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ఫేక్ పంపారని ఇటీవల యాదగిరిని సస్పెండ్ చేశారు. ఈయనతో పాటు జిల్లాలో మరో 8 మందిని కూడా సస్పెండ్ చేశారు. ఒక్కో పంచాయతీ కార్యదర్శికి 2, 3 గ్రామాలు అదనపు బాధ్యతలు విధులు నిర్వహిస్తున్నామని తమపై భారం మోపి సస్పెన్షన్ చేస్తే ఎలా అని కలెక్టరేట్ ఎదుట పంచాయతీ కార్యదర్శులు ఆందోళన నిర్వహించారు. ఎట్టకేలకు సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ తిరిగి కొనసాగించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని ఎంపీడీఓ బాలాజీ తెలిపారు.
పునఃప్రారంభమైన
ఆర్జిత సేవలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆర్జిత సేవలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. పవిత్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు విశేష పర్వాలు జరిగిన నేపథ్యంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను అధికారులు రద్దు చేశారు. పవిత్రోత్సవాలు ముగిసిన అనంతరం ఆలయ అధికారులు గురువారం ఉదయం ఆర్జిత సేవలను పునఃప్రారంభించారు. పూజల్లో భక్తులు పాల్గొని మొక్కలు తీర్చుకున్నారు.
జిల్లావ్యాప్తంగా భారీ వర్షం
భువనగిరిటౌన్ : జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి కురిసిన వర్షానికి భువనగిరి పట్టణంలో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అర్ధరాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉండడంతో పలు మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆత్మకూర్ మండలంలో 149 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా.. అడ్డగూడూరు మండలంలో 122, వలిగొండ 105, చౌటుప్పల్ 100, గుండాల 81, ఆలేరు 77, నారాయణపురం 76, రామన్నపేట 76, మోత్కూర్ 60, మోటకొండూరు 50, భువనగిరి 49, రాజాపేట 45, బొమ్మలరామారం 38, బీబీనగర్ 36, పోచంపల్లి 27, తుర్కపల్లి 15, యాదగిరిగుట్ట 12, చౌటుప్పల్‌లో 87 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.