
నృసింహుడి ఆలయ భద్రతపై ఆందోళన
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో ఆలయంలో చింతపండు దొంగతనం, ఆలయ పరిసరాల్లోని గిరి ప్రదక్షిణ, పాతగోశాలలోని డార్మింటరీ హాల్‌లో వైర్ల చోరీలు జరిగాయి. అయినా ఆలయ పోలీసులు, అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ప్రస్తుతం ఆలయ గిరి ప్రదక్షిణ మార్గంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలను చోరీ చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు రంపంతో కోసారు.
గతేడాది బిగించినప్పటికీ..
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సుమారు రూ.20లక్షల వ్యయంతో ఈసీఐఎల్ కంపెనీతో సుమారు 100 విద్యుత్ స్తంభాలు, విద్యుత్ దీపాలను బిగించారు. గతేడాది ఇవి బిగించినప్పటికీ వీటి పర్యవేక్షణపై ఎస్‌పీఎఫ్ పోలీస్, స్థానిక పోలీసులు సరైనా నిఘా పెట్టడం లేదు. దీంతో గిరి ప్రదక్షిణ మార్గంలో బిగించిన విద్యుత్ స్తంభాలను గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 10 నుంచి 15 చోట్లా రంపంతో కట్ చేశారు. గుర్తించిన విద్యుత్ సిబ్బంది ఆ స్తంభాలను ఆలయ మీటర్ యార్డు గదిలో భద్రపరిచారు. మరికొన్ని చోట్ల అలాగే వదిలేశారు. వాటిని సైతం రాత్రి సమయంలో దుండగులు దొంగిలించేందుకు యత్నిస్తున్నారు.
గతంలో సైతం..
ఆలయ సన్నిధిలోని పాత గోశాలలో గతంలో భద్రపరిచిన విద్యుత్ వైర్‌ను దొంగిలించుకుపోయారు. ఇటీవల సుమారు 120 మీటర్లకు పైగా వైర్‌ను సైతం దుండగులు అపహరించుకుపోయారు. గత మూడు నెలల క్రితం ఆలయ ప్రసాద విభాగంలో సైతం చింతపండును దొంగిలిస్తూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది పట్టుబడ్డారు. ఇందంతా సరైన పర్యవేక్షణ, నిఘా లేకపోవడంతోనే జరుగుతుందనే అనుమానాలు భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి.
ఈసీఐఎల్ కంపెనీకి బిల్లులు ఇవ్వకపోవడంతో..
ఆలయ గిరి ప్రదక్షిణ మార్గంలో ఈసీఐఎల్ కంపెనీ ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాల పనులకు అధికారులు బిల్లులు చెల్లించకపోవడంతో పాటు వీటి నిర్వహణను ఆలయ అధికారులకు అప్పగించలేదని సమాచారం. దీంతో విద్యుత్ స్తంభాలు విరిగినా, ఎవరైనా దొంగిలించినా ఎవరూ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఈసీఐఎల్ కంపెనీకి దేవస్థానం బిల్లులు చెల్లిస్తే, వీటి నిర్వహణ ఆలయ అధికారులు చూసుకునే అవకాశం ఉంది.
ఫ గతంలో ఆలయ ప్రసాద విభాగంలో చింతపండు, పాతగోశాల
డార్మింటరీ హాల్‌లో వైర్ల చోరీ
ఫ ఇటీవల గిరి ప్రదక్షిణ మార్గంలో విద్యుత్ స్తంభాలు అపహరించేందుకు యత్నం
ఫ పర్యవేక్షణ లోపించడంతోనే
దొంగతనాలకు పాల్పడుతున్నారని భక్తుల ఆరోపణ
సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం
గిరి ప్రదక్షిణ మార్గంలో ఈఓతో మాట్లాడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ఈ మార్గంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు సంబంధించిన బిల్లులు ఇవ్వలేదనే నెపంతో ఈసీఐఎల్ కంపెనీ పూర్తి స్థాయిలో నిర్వహణ చేయలేకపోతోంది. రాత్రి సమయాల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బందితో గిరి ప్రదక్షిణ మార్గంలో నిఘా ఏర్పాటు చేస్తాం. రంపంతో కోసి పక్కన పెట్టిన విద్యుత్ స్తంభాలను మీటర్ యార్డు గదిలో భద్రపరిచాం.
– రామారావు, ఈఈ విద్యుత్ విభాగం