
కాలానికి అనుగుణంగా డిజైన్లు రూపొందించాలి
భువనగిరిటౌన్ : మారుతున్న కాలానికి అనుగుణంగా చేనేత డిజైన్లు రూపొందించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రాయగిరి క్రాస్ రోడ్డు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు చేనేత కార్మికులు చేపట్టిన ర్యాలీని, కలెక్టర్ హనుమంత రావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు, ఏడీ హ్యాండ్లూమ్ శ్రీనివాస్ ప్రారంభించారు. చేనేత కళను కాపాడుతామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇక్కత్ వస్త్రాలు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచాయన్నారు. ఫ్యాషన్‌కు తగ్గట్టుగా వస్త్రాలు తయారు చేస్తే మార్కెటింగ్ బాగా పెరుగుతుందని తెలిపారు చేనేత రంగాన్ని ప్రోత్సహించే విధంగా స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవిధంగా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. నేతన్నకు చేయూత, నేతన్న బీమా చెక్కులను అందజేశారు. చేనేత రంగంలో విశేష కృషి చేసిన నేతన్నలను సన్మానించి, మెమొంటో అందజేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, చేనేత సహకార సంఘం ప్రెసిడెంట్ జల్ది రాములు, కార్మిక సంఘ నాయకుడు లక్ష్మీనరసయ్య, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు సుధాకర్, చేనేత సహకార సంఘం ప్రెసిడెంట్ సుధాకర్ సుదర్శన్, డెవలప్‌మెంట్ ఆఫీసర్ రాజేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ సత్యనారాయణ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు