
మూడేళ్లు.. ముగ్గురు అన్నదమ్ములకు అవార్డులు
చండూరు: చండూరు మండల కేంద్రానికి చెందిన చిలుకూరి శ్రీనివాసులు సహజ సిద్ధమైన రంగులతో డబుల్ ఇక్కత్ దుపట్టాను తయారు చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపికయ్యారు. శ్రీనివాసులు అన్న చిలుకూరి క్రిష్ణయ్య 2023లో, తమ్ముడు చిలుకూరి ధనుంజయ 2024లో కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులు అందుకున్నారు. దాదాపు 35 సంవత్సరాలుగా ముగ్గురు అన్నదమ్ములు డబుల్ ఇక్కత్ పైనే ప్రావీణ్యం సంపాదించారు. మూడేళ్ల క్రితం వరకు రసాయన రంగులతో డబుల్ ఇక్కత్ వస్త్రాలు నేసినా ఆ తర్వాత నుంచి సహజ సిద్ధమైన రంగులకు మారి మంచి ఆదరణ పొందుతున్నారు. ఈ ఉత్పత్తులకు మంచి డిమాండ్ కూడా ఉంది. దుపట్టా తయారు చేసేందుకు రెండు నెలల సమయం పట్టిందని, శ్రీనివాసులు తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీపై ముడి సరుకులు ఇచ్చి చేనేత కార్మికులను ప్రోత్సహిస్తే ఉత్పత్తిని పెంచి తక్కువ ధరల్లో వస్త్రాలు అందుబాటులో ఉంచేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. తనకు అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.