
చేనేత కార్మికులకు అండగా ఉంటాం
యాదగిరిగుట్ట: చేనేత కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు అన్నారు. గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఆయన దర్శించుకొని, అనంతరం పట్టణంలోని బీసీ కాలనీలో నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం విదేశీ మోజులో చేనేత దుస్తులను ఎవరూ ధరించకపోవడంతో ఇతర ప్రాంతాలకు చేనేత కార్మికులు వెళ్తున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. ముద్ర పథకం కింద కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణాలు అందించి ఆదుకుంటుందన్నారు. చేనేత వస్త్రాలను విదేశాలకు పంపించే అవకాశం ప్రధాని నరేంద్ర మోదీ కల్పించారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేనేత కార్మికులను పట్టించుకోలేదన్నారు. కానీ ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు. చేనేత వస్త్రాలు ధరించాలనే సంకల్పం ప్రతి వ్యక్తిలో రావాలన్నారు. చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరైన పథకాలు అమలు చేయడంలేదన్నారు. పవర్‌లూమ్స్ కార్మికుల జీవితాలు దుర్భర స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు ఎలాంటి సమస్యలు ఉన్నా బీజేపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు. మొదటిసారి యాదగిరిగుట్టకు ఆయనకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు అశోక్‌గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్, దాసరి మల్లేశం, వట్టిపల్లి శ్రీనివాస్‌గౌడ్, జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య, చేనేత విభాగం మాజీ కన్వీనర్ కర్నాటి ధనుంజయ్య, ఎన్నం శివకుమార్, మచ్చ సుధాకర్, రచ్చ శ్రీనివాస్, గంజి బసవలింగం, పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్, ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
ఫ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

చేనేత కార్మికులకు అండగా ఉంటాం