
నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలి
భూదాన్‌పోచంపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉందని హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములుతో కలిసి భూదాన్‌పోచంపల్లిని ఆయన సందర్శించారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. చేనేత కార్మికులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేనేత సహకార సంఘం, చేనేత గృహాలను సందర్శించారు. చేనేత వస్త్రాలు, మగ్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నది చేనేత పరిశ్రమనే అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అందరూ తప్పనిసరిగా చేనేత వస్త్రాలు ధరించాలనే నిబంధనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తే చేనేత కార్మికుల వస్త్రోత్పత్తులకు మార్కెటింగ్ పెరుగుతుందన్నారు. చేనేత సహకార సంఘాలను బలోపేతం చేయాలని, సబ్సిడీపై నూలు, ముడిసరుకును అందించి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి పోచంపల్లికి మెగా చేనేత క్లస్టర్ మంజూరుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మోదీ ప్రధాని అయిన తర్వాతే జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించారని వివరించారు. చేనేత సహకార సంఘాలకు ఆద్యుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. చేనేత పరిశ్రమలో 70శాతం మహిళలు పనిచేడం గొప్పవిషయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా, వారి పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలని కోరారు. దేశంలో తెలంగాణ నుంచే రూ.3లక్షల కోట్ల విలువైన చేనేత వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయంటే మన చేనేత వస్త్రాలకు ఉన్న డిమాండ్ అర్థమవుతుందని అన్నారు. అనంతరం పలువురు చేనేత నాయకులు, కార్మికులు బండారు దత్తాత్రేయను సన్మానించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో చేనేత రాష్ట్ర నాయకులు కర్నాటి ధనుంజయ్య, ఎన్నం శివకుమార్, భారత లవకుమార్, సతీష్, నోముల గణేశ్, భారత వాసుదేవ్, చిక్క కృష్ణ, అంకం పాండు, సీత శ్రీరాములు, సీత సత్యనారాయణ, కర్నాటి బాలరాజు, రుద్ర అంజనేయులు, మెరుగు శశికళ, కర్నాటి అంజమ్మ, గంజి బస్వలింగం, ఏలే శ్రీనివాస్, కేసారం కృష్ణారెడ్డి, బడుగు శ్రీకాంత్, కడవేరు శేఖర్, ఇంజమూరి యాదగిరి, భారత అంజనేయులు పాల్గొన్నారు.
ఫ హరియాణా మాజీ గవర్నర్
బండారు దత్తాత్రేయ

నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలి