
కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం నిర్మించారు
చండూరు: డబ్బులు, కాంట్రాక్టర్ల కోసమే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మించిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత ఉన్నా, మేడిగడ్డ వద్ద నిర్మించారని, కాళేశ్వరంలో డిజైన్ లోపం, నిర్లక్ష్యం, అవినీతి చోటుచేసుకుందని మండిపడ్డారు. ఆదివారం చండూరు మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్, ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరో విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే కాలంలో మునుగోడులోనే కంటి ఆస్పత్రి నిర్మించి ప్రజలకు ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలిపారు. ఇది సేవా కార్యక్రమమని, రాజకీయాలతో సంబంధం లేదన్నారు. అన్ని ప్రభుత్వమే చేయాలంటే కష్టమని, భగవంతుడు ఇచ్చిన శక్తి కొద్దీ సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని కోరారు. విద్య, వైద్యం తనకు రెండు కళ్లు అని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 18 రెసిడెన్షియల్ పాఠశాలల్లో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించే పనులు మెదలుపెట్టామని తెలిపారు. 614 మంది పాల్గొన్న ఈ శిబిరంలో 245 మందిని ఆపరేషన్‌కు ఎంపిక చేసి, 117 మందిని వెంటనే తరలించగా.. మిగిలిన 128 మందిని మంగళవారం తీసుకెళ్లి ఆపరేషన్లు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మాదగోని విజయలక్ష్మి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొరిమి ఓంకారం, జిల్లా నాయకులు కావలి ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ పల్లె వెంకన్న, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి