
కాల్వల అభివృద్ధికి నిధులిస్తాం..
భూదాన్‌పోచంపల్లి : పిలాయిపల్లి, బునాదిగాని, ధర్మారెడ్డిపల్లి కాల్వలకు త్వరగా భూసేకరణ ప్రక్రియ పూర్తిచేస్తే ఎన్ని నిధులైనా మంజూరు చేస్తామని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం భూదాన్‌పోచంపల్లిలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి తనకు ప్రియమిత్రుడు, దగ్గరి బంధువు అని, ఆయన కోరిక మేరకే పిలాయిపల్లి, బునాదిగాని, ధర్మారెడ్డిపల్లి కాలువలకు నిధులు మంజూరు చేశానన్నారు. అలాగే ఎమ్మెల్యే కోరినట్టుగా అలీనగర్, బొల్లేపల్లి, భీమలింగం కాలువల నిర్మాణాలకు నిధుల మంజూరుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు. కార్యకర్తల కష్టంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు గాను 11 స్థానాలు గెలిపించి జిల్లాను రాష్ట్రాన్ని శాసించే స్థాయికి తీసుకొచ్చారని కొనియాడారు. గొప్ప చరిత్ర కలిగిన పోచంపల్లికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఇది.. ఇందిరమ్మ పాలన : ఎమ్మెల్యే కుంభం
మంత్రులు మన దగ్గరిక వచ్చి సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తున్నారని.. కాంగ్రెస్ ప్రజాపాలన ఇందిరమ్మ పాలన అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. దేశంలో మరెక్కడలేని విధంగా సన్నబియ్యం అందజేస్తున్నామని గుర్తుచేశారు. మూసీ సాగునీటి కాల్వలకు రూ.500ల కోట్ల నిధులు మంజూరు చేసి ప్రత్యేక అభిమానం చూపిస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంతో పేదవారు కడుపునిండా తింటున్నారని పేర్కన్నారు. అర్హులందరికీ రేషన్‌కార్డులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, చౌటుప్పల్ ఆర్టీఓ శేఖర్‌రెడ్డి, డీఎస్‌ఓ రోజా, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డి, డీటీ నాగేశ్వర్‌రావు. ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, భువనగిరి మార్కెట్‌కమిటీ చైర్మన్ రేఖా బాబురావు, జిల్లా గ్రంథాలయశాఖ చైర్మన్ అవైస్ చిస్తీ, పోత్నక్ ప్రమోద్‌కుమార్, కాంగ్రెస్‌జిల్లా నాయకులు తడక వెంకటేశం, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షుడు పాక మల్లేశ్, పట్టణ అధ్యక్షుడు భారత లవకుమార్, డీసీసీ ఉపాధ్యక్షుడు కళ్లెం రాఘవరెడ్డి పాల్గొన్నారు.
పిలాయిపల్లి, బునాదిగాని, ధర్మారెడ్డిపల్లి కాల్వలకు భూసేకరణ పూర్తిచేయండి
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
పోచంపల్లి, ఆలేరులో
రేషన్ కార్డుల పంపిణీ
పేదలకు విస్మరించిన బీఆర్‌ఎస్ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలను విస్మరించిందని ఏ ఒక్కరికి ఇల్లు, రేషన్‌కార్డు ఇచ్చిన పాపాన పోలేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు సన్నబియ్యంతో పాటు కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తోందన్నారు. ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు.