
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయాల్లో సింధూరంతో పాటు పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చన జరిపించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేధ్యాన్ని సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా జరిగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు కొనసాగాయి.
ఆస్పత్రుల్లో మందులు
అందుబాటులో ఉంచాలి
ఆలేరురూరల్ : ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుచాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవాం ఆలేరు మండలం శారాజీపేట గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలోని అన్ని రూమ్‌లను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం మంతపురిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు, వెంటర్నరీ హెల్త్ క్యాంపులో గొర్రెలకు వేస్తున్న బ్లూ టంగ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆయన వెంట వెంటర్నరీ అధికారి డాక్టర్ పి.చైతన్య, ఎంపీడీఓ సత్యాంజనేయప్రసాద్, హౌసింగ్ ఏఈ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
నాణ్యమైన భోజనాన్ని అందించాలి
యాదగిరిగుట్ట రూరల్: విద్యార్ధులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందజేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్ధులకు స్వయంగా వడ్డించారు. కొత్త అడ్మిషన్‌లు గురించి ఆరా తీసి మాట్లాడారు. ఆయన వెంట హెచ్‌ఎం కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు.
గౌస్‌కొండలో
కేంద్ర బృందం పర్యటన
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని గౌస్‌కొండ గ్రామంలో మంగళవారం కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం సర్వే నిర్వహించింది. సర్వే బృందం అధికారులు వనజ, జుబేదా బేగం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, గ్రామపంచాయతీ కార్యాలయం, అంగన్‌వాడీ కేంద్రాల్లో తడి, పొడి చెత్త నిర్వహణ పారిశుద్ధ్యం, ఇంకుడుగుంతలపై సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో ఎండీపీడీ భాస్కర్, ఎంపీఓ మాజిద్, ఏపీఓ కృష్ణమూర్తి, జిల్లా ఎస్‌బీఎం కోఆర్డినేటర్ మురళి, టెక్నికల్ అసిస్టెంట్ మాధవి, పంచాయతీ కార్యదర్శి సరిత పాల్గొన్నారు.
ఓఆర్‌ఎస్‌తో ఎంతో మేలు
బీబీనగర్: ఓఆర్‌ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్) ద్రావణంతో ఎంతో ప్రయోజనకారి అని బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాల వైద్యులు తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్‌లోని పీడీయాట్రిక్స్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఓఆర్‌ఎస్ వారోత్సవాల్లో భాగంగా చిన్నారుల తల్లులకు ఓఆర్‌ఎస్ ప్రాముఖ్యతను వివరించారు. ఓఆర్‌ఎస్ తయారీపై ప్రదర్శనలు, ఆరోగ్య నిపుణలతో ఇంటరాక్టివ్ సెషన్‌లు నిర్వహించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ అభిషేక్ ఆరోరా, డీన్ సంగీత సంపత్, పీడీయాట్రిక్ విభాగాధిపతి సిబాబ్రత్త పట్నాయక్, వైద్యులు మధుసూదన్, మనీషా, నితిన్ జాన్ పాల్గొన్నారు.

యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు

యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు