
నృసింహుడి క్షేత్రంలో కోలాహలం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యారాధనలు, వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కోలాహలం నెలకొంది. ఆదివారం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, అర్చనలతో కొలిచారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు గావించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. సాయంత్రం ఆలయంలో వెండి జోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.