గడువులోపు సాధ్యమేనా!
పంట సీజన్‌లో బునాదిగాని కాల్వ విస్తరణ
బీబీనగర్: జిల్లాలో ప్రధాన సాగునీటి వనరుగా ఉన్న బునాదిగాని కాల్వ విస్తరణ పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి. పనుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.266.69 కోట్లు విడుదల చేసింది. 98 కిలో మీటర్లకు గాను.. తొలి దశలో బీబీనగర్ మండల పరిధిలోని మక్తా అనంతారం నుంచి ఎర్రకుంట వరకు ఐదు కిలో మీటర్ల మేర కాల్వ పనులు జూలై 10 లోపు పూర్తి చేసి సాగు నీరు విడుదల చేయాలని నిర్ణయించింది. అంత వరకు బాగానే ఉన్నా పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే అనుకున్న తేదీకి పూర్తయ్యేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాల వల్ల కాలువలో పూడికతీత సమయంలో నీటి ఊట వస్తుండటం ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా పనులు మొదలై 25 రోజులు గడిచినా అర కిలో మీటరు దూరమే పూర్తయ్యాయి.
98కిలో మీటర్ల మేర జరుగనున్న విస్తరణ
బీబీనగర్ మండల పరిధిలోని మక్తా అనంతారం శివారులో మేడ్చల్ – యాదాద్రి జిల్లా సరిహద్దులోని మూసీ నుంచి అడ్డగూడూరు మండలం ధర్మారం చెరువు వరకు 98 కిలో మీటర్లు బునాది కాల్వను విస్తరించనున్నారు. ప్రసుత్తం ఉన్న కాల్వ సరిగా లేకపోవడంతో ఎగువ ప్రాంతానికి నీరు వెళ్లని పరిస్థితి నెలకొంది. బీబీనగర్, భవనగిరి మండలాల పరిధిలోని భూములకు మాత్రమే నీరందుతుంది. మొదటి దశలో 5 కిలో మీటర్ల మేర కాల్వను ఆధునీకరించి పంటలకు నీటిని విడుదల చేస్తామని అధికారులు చెప్పుకొస్తున్నారు.
పనులకు ఆటంకం
కాల్వ పనులను మొదలు పెట్టి 25 రోజులు గడిచినా ఇంకా 500 మీటర్ల మేర మాత్రమే పనులు పూర్తయ్యాయి. మక్తా అనంతారం వద్ద కాల్వ పూడిక తీత, సిమెంట్ కాంక్రీట్ బెడ్ పనులు జరిగాయి. ఇంకా నాలుగున్నర కిలో మీటర్ల మేర పనులు జరగాల్సి వుంది. జూలై 10న నీటిని విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నా గడువులోపు మొదటి దశ పనులు పూర్తిస్థాయిలో జరిగేలా కనిపించడం లేదు. అడుగు భాగంలో 66 మీటర్లు, పైభాగంలో 30 మీటర్ల వెడల్పుతో కాల్వను విస్తరిస్తున్నారు.కాల్వ పూడీక తీసేటప్పుడు నీరు ఊరుతుండడంతో పనులకు ఆటంకం ఏర్పడుతుంది.
సకాలంలో నీటిని వదలాలి
బునాదిగాని కాల్వ విస్తరణ మొదటి దశ పనులను త్వరగా పూర్తిచేసి అధికారులు చెబుతున్నట్టుగా జూలై 10వ తేదీ వరకు కాల్వ ద్వారా నీటిని విడుదల చేయాలి. నాకున్న ఎకరం పొలంతో పాటు కౌలుకు తీసుకున్న 10 ఎకరాలు బునాదిగాని కాల్వ నీటి ద్వారానే సాగు చేస్తాను. క్రాప్‌హాలిడే ప్రకటిస్తే రైతులంతా నష్టపోతాం. సకాలంలో పనులు పూర్తి చేసి కాల్వకు నీటిని విడుదల చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలి.
– జక్కి సంతోష్, రైతు, రాఘవాపురం
జూలై 10న నీటి విడుదల
కాల్వ విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా కాల్వ కట్టలు తెగిన చోట, క్రాసింగ్‌లను గుర్తించి పూడిక తీత, సిమెంట్ కాంక్రీట్ బెడ్ పనులు చేపడుతున్నాయం. మొదటి దశలో 5 కిలో మీటర్ల మేర కాల్వ విస్తరణ పనులను జూలై 10లోపు పూర్తి చేసి సాగు నీటిని విడుదల చేస్తాం.
– భరత్‌కుమార్, ఇరిగేషన్ ఏఈ
తొలి దశలో ఐదు కిలో మీటర్లు..
జూలై 10వ తేదీలోపు పనులు పూర్తి చేసి
రైతులకు నీరివ్వాలని నిర్ణయం
25 రోజులు గడిచినా
అర కిలో మీటరు దూరమే పూర్తి
సకాలంలో నీటి విడుదలపై సందేహాలు
క్రాప్‌హాలిడే ప్రకటిస్తారన్న ప్రచారం
క్రాప్‌హాలిడే తప్పదా?
పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే వానాకాలం సీజన్ ఆయకట్టులో క్రాప్‌హాలిడే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. 98 కిలో మీటర్ల మేర పనులు జరగాల్సి ఉన్నందున ఇంకా 500 మీటర్ల మేర మాత్రమే పూర్తయ్యాయి. క్రాప్‌హాలిడే ప్రకటించకపోతే పనులు ముందుకు సాగే పరిస్థితి ఉండదు. దీంతో ఆయకట్టు రైతులకు అవగాహన కల్పించడతో పాటు భూ సేకరణ విషయంలో నచ్చజెప్పి సర్వే చేపట్టడంలో ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకునేలా అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. క్రాప్‌హాలిడే ప్రకటిస్తే మండల పరిధిలోని 300కు పైగా రైతు కుటుంబాలపై ప్రభావం చూపడంతో పాటు 500 ఎకరాలకు పైగా సాగు పనులు నిలిచిపోనున్నాయి.
గడువులోపు సాధ్యమేనా!
గడువులోపు సాధ్యమేనా!


