యథావిధిగా ప్రజావాణి
భువనగిరిటౌన్ : కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి ఈనెల 22 నుంచి యథా విధిగా కొనసాగుతుందని కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలి పారు. పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజా వాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు. 17న కోడ్ ముగిసినందున ప్రజావాణిని పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు గమనించి, తమ సమస్యలపై కలెక్టరేట్ కు వచ్చి వినతిపత్రాలు అందజేయవచ్చన్నారు.
సీఎంను కలిసిన ప్రభుత్వ విప్
యాదగిరిగుట్ట : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కలిశారు. శాలువాతో సీఎంను సత్కరించి, శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చించినట్లు ఐలయ్య తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో 80శాతానికి పైగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడంపై సీఎం అభినందించారని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సీఎం సూచించారని ఐలయ్య తెలిపారు. అదే విధంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. శ్రీస్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.
22న మాక్ ఎక్సర్‌సైజ్
భువనగిరిటౌన్ : వరదలు, పరిశ్రమల్లో ప్రమాదాల నివారణపై ఈనెల 22న మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికారి సంస్థ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర ఫైర్ సర్వీస్ డైరెక్టర్ నారాయణరావు శుక్రవారం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ హనుమంతరావు వారికి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్‌ఓ జయమ్మ, ఆర్డీఓ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైజ్ఞానిక ప్రదర్శనలు.. సృజనకు వేదికలు
వలిగొండ : విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడుతాయని డీఈఓ సత్యనారాయణ అన్నారు. వలిగొండలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈనెల 22,23 తేదీల్లో నిర్వహించే జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రధానోపాధ్యాయలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యాశాఖ వివిధ చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే ఈసారి గ్రామీణ ప్రాంతమైన వలిగొండలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు ప్రదర్శనకు హాజరయ్యే చూడాలన్నారు. వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహణ బాధ్యతలు చూడటానికి 14 కమిటీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రశాంత్‌రెడ్డి, అధికారులు పాండు, రఘురాంరెడ్డి, ఎంఈఓలు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
యథావిధిగా ప్రజావాణి


