యాసంగి పనులు ముమ్మరం
సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాం. అధిక దిగుబడుల కోసం రైతులు ఇష్టానుసారంగా రసాయనిక ఎరువులు వాడుతున్నారు. సేంద్రియ ఎరువులు వాడితే అనేక ప్రయోజనాలు ఉంటాయి. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచన మేరకు యాజమాన్య పద్ధతులు పాటించాలి.
–వెంకటరమణారెడ్డి,
జిల్లా వ్యవసాయ అధికారి
రామన్నపేట : యాసంగి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొందరు రైతులు వరి నాట్లు వేస్తుండగా, మరికొందరు పొలాలను సిద్ధం చేస్తున్నారు. భూగర్భ జలమట్టం పెరగడంతో రైతులు ఆరుతడి పంటకు బదులు వరి సాగువైపై మొగ్గు చూపుతున్నారు. అయితే నాటు వేసేందుకు స్థానికంగా కూలీ లు కొరత ఉంది. దీంతో రైతులు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువచ్చి నాట్లు వేయిస్తున్నారు.
పెరగనున్న వరి సాగు
గత యాసంగితో పోలిస్తే ప్రస్తుత సీజన్‌లో వరిసాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అక్టోబర్, నవంబర్ మాసాల్లో కురిసిన భారీ వర్షాలకు భూగర్భజలాలు పెరిగాయి. చెరువులు, కుంటల్లోకి నీరు చేరింది. గత సీజన్‌లో 2,86,252 ఎకరాల్లో వరి వేయగా.. ఈసారి 3,12,500 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.
ఉత్తరప్రదేశ్ నుంచి కూలీల రాక..
స్థానికంగా కూలీల కొరత ఏర్పడడంతో రైతులు బయటి ప్రాంతాల వారిని రప్పించి వరి నాట్లు వేయిస్తున్నారు. హుజూర్‌నగర్, తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాలకు చెందిన కూలీలు వస్తున్నారు. రామన్నపేట మండలంలోని పలు గ్రామాలకు ఉత్తరప్రదేశ్‌లోని సహజ్‌పూర్ నుంచి 165 మంది పురుషులు వచ్చి నాట్లు వేస్తున్నారు. ఇందుకు గాను ఎకరాకు రూ.5వేల నుంచి రూ.5,500 వరకు తీసుకుంటున్నారని రైతులు చెబుతున్నారు.
ట్రాక్టర్లకు ఫుల్ డిమాండ్
సాగు పనులు ఊపందుకోవడంతో ట్రాక్టర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఫుల్‌వీల్స్ ట్రాక్టర్‌కు గంటకు రూ.1,600, హాఫ్‌వీల్స్‌కు రూ.1,200 చొప్పున చార్జ్ తీసుకుంటున్నారని రైతులు అంటున్నారు. వానాకాలం వరి కోతల సమయంలో వర్షాలు కురువడం వల్ల పొలాలు సరిగా ఆరలేదు. వరికొయ్యలు నేలలో కలిసి ఎరువుగా మారడానికి రైతులు ఫుల్‌వీల్స్‌తో దున్నించడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో దున్నకం ఖర్చులు పెరిగాయి.
ఫ ఊపందుకున్న వరి నాట్లు
ఫ స్థానికంగా కూలీల కొరత
ఫ ఇతర ప్రాంతాల నుంచి రప్పిస్తున్న రైతులు
యాసంగి సాగు
విస్తీర్ణం.. ఎకరాల్లో
2023 2,80,000
2024 2,98,000
2025 3,12,500
(అంచనా)
యాసంగి పనులు ముమ్మరం


