పేదల బియ్యం.. అందని దైన్యం | - | Sakshi
Sakshi News home page

పేదల బియ్యం.. అందని దైన్యం

Oct 15 2026 11:53 AM | Updated on Oct 15 2026 11:53 AM

పేదల బియ్యం.. అందని దైన్యం

రేషన్‌ దుకాణం చుట్టూ తిరుగుతున్నాం

కిలో రూ. 80 పెట్టి కొనలేం

డీలర్లకు శిక్షణ ఇవ్వాలి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): చంద్రబాబు ప్రభుత్వం రేషన్‌ బియ్యం అందించేందుకు కొత్తగా అమల్లోకి తెచ్చిన నిబంధనలు లబ్ధిదారులపాలిట శాపాలుగా మారాయి. పౌరసరఫరాల శాఖ నుంచి రేషన్‌ దుకాణాలకు సరఫరా చేసిన బియ్యం బస్తాలను తొలుత డీలర్‌ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి దిగుమతి చేసుకోవాలి. ఆ తర్వాత లబ్ధిదారులకు పంపిణీ చేసే సమయంలో ప్రతి బస్తాను మరోసారి ఈ–పోస్‌ మిషన్‌తో స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ బియ్యం ఇచ్చే అవకాశం లేదు. ఈ క్రమంలో బస్తాలను స్కాన్‌ చేసేటప్పుడు.. వాటికి కుట్టి ఉంచిన క్యూఆర్‌ కోడ్‌ నలిగిపోవడం, చిరిగిపోవడం లేదా కుట్టులోకి వెళ్లిపోవడం వల్ల స్కానింగ్‌ ప్రక్రియ పూర్తికావడం లేదు. దీంతో అలాంటి బస్తాలను డీలర్లు పక్కన పెట్టి, వేరే బస్తాను స్కాన్‌ చేసి లబ్ధిదారులకు ఇవ్వాల్సి వస్తోంది. జిల్లాలో సుమారు 500 రేషన్‌ దుకాణాల్లో ఇలా స్కానింగ్‌ కాని బియ్యం బస్తాలు నిల్వ ఉండిపోయాయి. ఇవి సుమారు 40 టన్నుల వరకు ఉంటాయని అంచనా.

సుమారు 5 వేల మందికి అందని బియ్యం

పౌరసరఫరాల శాఖ లెక్కల ప్రకారం జిల్లావ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది రేషన్‌ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. స్కానింగ్‌ సమస్య కారణంగా డీలర్లు పక్కన పెట్టిన 40 టన్నుల బియ్యం వాస్తవానికి ఈ నెల మొదటి వారంలోనే పంపిణీ కావాల్సి ఉంది. అయితే, సాంకేతిక అడ్డంకుల వల్ల ఇప్పటివరకు సుమారు 5 వేల కుటుంబాలకు రేషన్‌ బియ్యం అందలేదు. నిబంధనల ప్రకారం ప్రతి నెలా 15వ తేదీలోపు రేషన్‌ పంపిణీ పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో, గడువు ముగిస్తున్నా బియ్యం అందని లబ్ధిదారులు వేల సంఖ్యలో మిగిలిపోవడంతో ప్రభుత్వం ఈ నిబంధనల్లో ఏమైనా సడలింపులు చేస్తుందా అని అంతా వేచి చూస్తున్నారు.

రేషన్‌ డిపోల్లో మగ్గిపోతున్న బియ్యం బస్తాలు

జిల్లావ్యాప్తంగా సుమారు 40 టన్నుల నిల్వ

సుమారు 5 వేల మందికి అందని వైనం

ప్రభుత్వ అనాలోచిత చర్యే కారణం

ఈ నెల బియ్యం తీసుకోవడానికి రేషన్‌ దుకాణానికి వెళితే డీలర్లు రేపురా, మాపురా అని తిప్పుకుంటున్నారు. గట్టిగా అడిగితే సాంకేతిక లోపం కారణంగా బియ్యం ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారు. బియ్యం కోసం పనులకు వెళ్లకుండా రేషన్‌ దుకాణం చుట్టూ తిరగడమే రోజువారీ పనిగా మారిపోయింది.

– గణేష్‌, రేషన్‌ బియ్యం లబ్ధిదారుడు, ఏలూరు

ఇప్పటికే ఇంట్లో బియ్యం అయిపోయాయి. బయట కొనాలంటే కిలో రూ.80 చెబుతున్నారు. అంత ధరపెట్టి కొనే స్థోమత నాకు లేదు. 15వ తేదీతో రేషన్‌ బియ్యం గడువు ముగిసిపోతుందంటున్నారు. సాంకేతిక కారణాలతో నాకు బియ్యం ఇవ్వకపోతే ఇంటిల్లపాదీ పస్తులు పడుకోవాల్సి వస్తుంది.

– పూజారి లత, రేషన్‌ బియ్యం లబ్ధిదారు, ఏలూరు

రేషన్‌ పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కొత్త విధానం తీసుకువస్తే ముందుగా దానిపై డీలర్లకు శిక్షణ ఇవ్వాలి. జిల్లాలోని రేషన్‌ డీలర్లలో దాదాపు 30 శాతం మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. అలాగే 10వ తరగతి లోపు విద్యార్హత ఉన్నవారు మరో 30 శాతం మంది ఉంటారు. వీరందరికీ కొత్త విధానంలోని సాఫ్ట్‌వేర్‌ వినియోగంలో గందరగోళం నెలకొంది. వీరికి సరైన శిక్షణ ఇస్తేనే ప్రభుత్వ నిబంధనలు పక్కాగా అమలు చేయడం సాధ్యపడుతుంది.

– రాజులపాటి గంగాధర్‌ గౌడ్‌, రేషన్‌ డీలర్ల ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement