మళ్లీ మన్యంలోకి పెద్దపులి | - | Sakshi
Sakshi News home page

మళ్లీ మన్యంలోకి పెద్దపులి

Oct 15 2026 11:47 AM | Updated on Oct 15 2026 11:47 AM

బుట్టాయగూడెం: ఉభయ గోదావరి జిల్లాల ప్రజలను గత కొంతకాలంగా ఆందోళనకు గురిచేస్తున్న పెద్దపులి మరోసారి తన రూటు మార్చింది. గత రెండు వారాలుగా గోదావరి నది దాటి ఇటు ఏలూరు జిల్లా, అటు తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి.. తాజాగా దసరా పండుగ వేళ ఏలూరు జిల్లా మన్యం ప్రాంతమైన బుట్టాయగూడెం మండల అటవీ పరిధిలోకి ప్రవేశించినట్లు బుధవారం సమాచారం వెల్లడైంది. అక్టోబరు 7న సీతానగరం వద్ద గోదావరి నది దాటిన పులి, ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని గూటాల, పట్టిసీమ పరిసర ప్రాంతాల మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోని తాళ్లపూడి, గోపాలపురం మండలాల వైపు కదిలింది. అనంతరం దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని మేరీమాత ఆలయం వెనుక ఉన్న క్వారీ ప్రాంతంలో దాని కదలికలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

పాపికొండల అటవీ ప్రాంతంలోకి..

అక్టోబరు 9, 10 తేదీల్లో తాళ్లపూడి మండలంలోని బయ్యవరం, తుపాకులగూడెం, రాగోలపల్లి ప్రాంతాలతో పాటు తాడేపల్లిగూడెం మండలం నందమూరు, ఉండ్రాజవరం మండలం పసలపూడి, చాగల్లు, లక్ష్మీపురం పరిసరాల్లో పులి సంచరించింది. అక్కడ కూడా అధికారులు పులిని బంధించేందుకు ప్రయత్నించారు. అక్టోబరు 11న కొవ్వూరు మండలం దేచర్ల క్వారీ ప్రాంతంలో అది సంచరించింది. మంగళవారం ఉదయం మైదాన ప్రాంతాల నుంచి తిరిగి అటవీ ప్రాంతం వైపు కదులుతున్న పులి.. బుట్టాయగూడెం మండలంలోని కొవ్వాడ – లక్ష్మీపురం గ్రామాల గుండా ప్రయాణించి పాపికొండల అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఇది అటవీ ప్రాంతంలోనే ఉంటుందా లేదా తిరిగి మైదాన ప్రాంతాలకు వస్తుందా అనే అనుమానంతో, అటవీ శాఖ అధికారులు పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

అప్రమత్తంగా ఉండాలి

పులి కదలికలను నిరంతరం గమనించేందుకు అటవీశాఖ సిబ్బంది ట్రాకింగ్‌ పరికరాలు, సీసీ కెమెరాల సాయంతో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని, పశువుల కాపరులు అటవీ సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పులి కనిపించినా లేదా దాని పాదముద్రలు గుర్తించినా, ఎట్టి పరిస్థితుల్లోనూ దాని దగ్గరకు వెళ్లకుండా వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement