ఏమో ఏం జరుగుతుందో సారూ.. | - | Sakshi
Sakshi News home page

ఏమో ఏం జరుగుతుందో సారూ..

Oct 15 2026 11:47 AM | Updated on Oct 15 2026 11:47 AM

ఉండి : ఎన్నికల వేళ ప్రభుత్వ భూముల ఆక్రమణ అంటూ అధికారులు కొలతలు వేయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ప్రజలను భయపెట్టేందుకు ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం గ్రామ పరిధిలోని పడవలరేవు ప్రాంతంలో ఆర్‌అండ్‌బీ, జిల్లా పరిషత్‌కు చెందిన స్థలాలు అని చెబుతున్న చోట సుమారు వంద సంవత్సరాల నుంచి పలు కుటుంబాలు కాపురముంటున్నాయి. వారిని గుర్తించి అధికారులు గతంలో ఇళ్ల స్థలాల పట్టాలు కూడా అందించారు. గ్రామ పంచాయతీ వారు వీరి నుంచి పన్నులు వసూలు చేస్తుండగా.. స్థానికులు విద్యుత్‌ బిల్లులు, కుళాయి పన్నులు చెల్లిస్తున్నారు. అలాగే కొందరు జిల్లా పరిషత్‌కు కూడా పన్నులు కడుతూ కుటుంబాలతో సంతోషంగా జీవిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఏం జరుగుతుందో తెలియదు గానీ, ఎన్నార్పీ అగ్రహారం గ్రామ పంచాయతీ అధికారులు 17 మందికి నోటీసులు జారీ చేసి, బుధవారం ఉదయం నుంచి అక్కడ కొలతలు వేయడం ప్రారంభించారు. దీంతో తమ ఇళ్లు కూల్చేస్తారేమోనని స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పడవలరేవులో జాతీయ రహదారి వైపుగా ఉండి కాలువను ఆనుకుని ఉన్న 113 సెంట్ల స్థలంలో 80 సెంట్లు జిరాయితీ భూమి ఉందని స్థానికులు చెబుతున్నారు. గతంలో రెవెన్యూ అధికారులు ఎంజాయ్‌మెంట్‌ పత్రాలు ఇచ్చి, ఆ తర్వాత వాటిని రద్దు చేయడంతో.. స్థానికుల్లో కొందరు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ, తాము ప్రభుత్వ భూములను పరిరక్షిస్తున్నామంటూ అధికారులు సర్వే చేసి కొలతలు వేశారు.

తహసీల్దార్‌ వివరణ

దీనిపై తహసీల్దార్‌ మంతెన రామప్రసాదరాజును వివరణ కోరగా.. పడవలరేవు ప్రాంతంలో రోడ్డు పోరంబోకు స్థలాన్ని ఆక్రమించారంటూ స్థానిక పంచాయతీ కార్యదర్శి నుంచి వచ్చిన విన్నపం మేరకు, తాము అధికారులను సర్వే చేసి మార్కింగ్‌ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

ఆక్రమణలంటూ కొలతలు వేస్తున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement