సీ సేఫ్‌తో పెరిగిన సాధారణ ప్రసవాలు | - | Sakshi
Sakshi News home page

సీ సేఫ్‌తో పెరిగిన సాధారణ ప్రసవాలు

Oct 15 2026 11:47 AM | Updated on Oct 15 2026 11:47 AM

తణుకు అర్బన్‌: సిజేరియన్‌లను తగ్గించి, సాధారణ ప్రసవాల సంఖ్యను ప్రోత్సహించేందుకు రూపొందించిన సిజేరియన్‌ సేఫ్టీ (సీ–సేఫ్‌) కార్యక్రమం తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో అద్భుత ఫలితాలు సాధించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కాకర్లమూడి సాయికిరణ్‌ స్పష్టం చేశారు. గతేడాది ఆగస్టులో ప్రారంభమైన ఈ సీ–సేఫ్‌ కార్యక్రమం ముగిసిన సందర్భంగా బుధవారం తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సీ–సేఫ్‌ వైద్య బృందంతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫెర్నాండెజ్‌ హాస్పిటల్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో, యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌హామ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ లివర్‌పూల్‌ (యూకే) భాగస్వామ్యంతో ఈ బృందం తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి వైద్యులకు ప్రత్యేక శిక్షణనిచ్చిందని తెలిపారు. ఈ శిక్షణ ఫలితంగా సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగి, సిజేరియన్ల రేటు 5 శాతానికి దిగువకు పడిపోయి ప్రాజెక్ట్‌ పూర్తిగా విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం శిక్షణా వైద్య బృందంలోని డాక్టర్‌ ఇంద్రజిత్‌ కౌర్‌, డాక్టర్‌ రాధాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమానంతరం శిక్షణ కాలానికి సంబంధించిన సీ–సేఫ్‌ రికార్డులను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ ఎల్‌. సాయిబాలాజీ, సీనియర్‌ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ జె. లెటోర్నాదేవి తదితర వైద్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement